3రోజుల నరకయాతన ...
కిడ్నాపర్లు చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అభం సుభం తెలియని పిల్లలను ఎత్తుకెళ్లిపోతున్నారు. వారి తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో సోమవారం రాత్రి జషిత్ అనే ఐదేళ్ల బాలుడును దుండగులు ఎత్తుకెళ్లారు. వారి తల్లిదండ్రులు పిల్లాడి జాడ తెలీక బోరుమన్నారు. 3 రోజులపాటు నరకయాతన అనుభవించారు.
విస్తృతంగా గాలింపు...
పోలీసులు... వార్తా ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో బాలుడి కోసం గాలించారు. సామాన్య ప్రజలు సైతం పసివాడు క్షేమంగా తిరిగి రావాలని ఫొటో షేర్ చేశారు. 17 బృందాలు ఈ కేసు ఛేదించేందుకు ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ నయీం. మండపేటలోనే మకాం వేసి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్‌స్టాప్‌లలో సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి అనుమానితుల చిత్రాలు విడుదల చేశారు. ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా... కిడ్నాపర్లు ఎటూ పారిపోకుండా జాగ్రత్త పడ్డారు.
భయపడిన కిడ్నాపర్లు...
పోలీసులు, పౌరసమాజం అప్రమత్తమయ్యేసరికి కిడ్నాపర్లు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పిల్లాణ్ని కిడ్నాప్ చేసి 3రోజులైనా... జిల్లా దాటే వీల్లేకుండా పోయింది. అదే కిడ్నాపర్ల వెన్నులో వణుకు పుట్టించింది. పరిస్థితి గమనించి బాలుణ్ని వదిలివెళ్లారు. పోలీసుల వ్యూహాత్మక ప్రచారం... జనచైతన్యం... ఈ కేసులో కీలకంగా మారింది. ఏడెనిమిది కిలోమీటర్లు పరిధి దాటి వెళ్లలేకపోయారు నిందితులు.
మమ్మీ కావాలని ఏడ్చాను: జషిత్
తనను ఎత్తికెళ్లిన వారు రోజు ఇడ్లీ పెట్టారని...మమ్మీ కావాలి అని ఏడ్చినా తీసుకెళ్లలేదని జషిత్ చెప్పే బుజ్జిబుజ్జి మాటలు... కళ్లల్లో నీళ్లు తెప్పించాయి. తనను ఎవరూ కొట్టలేదని...ఎత్తుకెళ్లిన వారిలో ఒకరి పేరు రాజని చెప్పాడు. తనను వెతికేందుకు ప్రయత్నించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు జషిత్.
నాన్నమ్మను కొట్టి ఎత్తుకెళ్లిన దుండగులు
మండపేటలోని తమ నివాసంలో రెండో అంతస్తులో జషిత్‌ను కిడ్నాప్ చేశారు దుండగులు. నాన్నమ్మ వద్ద ఆడుకుంటుండగా... ఆమె మొహంపై బలంగా మోది... క్షణాల్లో జషిత్‌ను ఎత్తుకెళ్లిపోయారు కిడ్నాపర్లు. అప్పట్ని నుంచి కుటుంబ సభ్యులు నిద్రహారాలు మానేసి జషిత్ కోసం వేయి కళ్లతో ఎదురు చూశారు. మూడు రోజుల తర్వాత క్షేమంగా జషిత్ వచ్చేసరికి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.
నిందితుల కోసం పోలీసుల వేట
పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహించారు. ఇంటి వద్ద బాలుడి అపహరణ, నిందితులు తప్పించుకున్న తీరు విశ్లేషిస్తున్నారు. జషిత్ కుటుంబం నివాసం ఉంటున్న ఇంటికి సమీపంలో ఈనెల మూడున ఇద్దరు అపరిచితులు అద్దె ఇల్లు కోసం తిరగిన దృశ్యం సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఆ కోణంలోనూ దర్యాప్తు చేశారు. ఏదీఏమైనా చిన్నారి క్షేమంగా ఇంటికి చేరడంపై అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు తప్పించుకున్న నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.