కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ 4.0 ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది. వీటిలో భాగంగా... కొన్ని రాష్ట్రాలు గత నెలలోనే మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చి కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నాయి. ఈ క్రమంలోనే పుదుచ్చేరి రాష్ట్రం తమ పరిధిలోని నాలుగు ప్రాంతాలైన... తమిళనాడు రాష్ట్రంలోని పుదుచ్చేరి, కారెకాల్.. కేరళలోని మాహే, ఆంధ్రప్రదేశ్లోని యానాంలలో మద్యం షాపులు తెరిచేందుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం మే 18న ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై ఆ రాష్ట్ర గవర్నర్ కిరణ్ బేడి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నాలుగు ప్రాంతాలలో మద్యం ధరలు తక్కువగా ఉండటం వల్ల... సమీప రాష్ట్ర ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, కరోనా వ్యాప్తి చెందుతుందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో మద్యం ధరలు వందశాతం పెంచి... బయటివారిని నిలువరించే చర్యలు చేపట్టిన అనంతరమే మద్యం షాపులు తెరవాలని ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసిన వ్యాపారులు ... పుదుచ్చేరి, కారెకాల్, మాహేలలో మే నెలాఖరు నుంచి అమ్మకాలు చేపట్టగా... ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో యానాంలో మాత్రం నేటికీ మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడమే.
మద్యం షాపులు తెరిస్తే... ధర తక్కువ కావటం వల్ల సమీప జిల్లా ప్రజలంతా వస్తే అదుపు చేయడం కష్టమనే భయంతో అధికారులు షాపులు తెరిచేందుకు నిరాకరిస్తున్నారు. నెల రోజులుగా ఈ ప్రతిష్టంభన కొనసాగుతుండడం వల్ల మద్యం బాబులు జిల్లా సరిహద్దులోని షాపుల నుంచి కొనుగోలు చేసుకొంటూ తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు.
ఇదీ చూడండి:'రాష్ట్రస్థాయి పాల ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉన్నాం'