గోదావరి తీరంలో వరద ప్రవాహం తగ్గుతున్నా ప్రజలకు ఇసుక కష్టాలు మాత్రం తీరడం లేదు. నది చెంతనే ఉన్న ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. తూర్పు గోదావరి జిల్లాలో సామాన్యులు ఇసుక కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం శూన్యమే. గతంలో ర్యాంపులో ఉన్న అధికారికి నేరుగా నగదు చెల్లించి ఇసుక పొందేవారు. అయితే నూతన విధానం ద్వారా ఇంకా సులభంగా ఇసుకను సరఫరా చేయాలని సర్కారు భావించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది.
వ్యయప్రయాసల ఇసుక'పాలసీ'
నూతన ఇసుక విధాన పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పగించింది. అలాగే స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా దీనికి అనుసంధానించింది. ఇసుక కావాలంటే తొలుత అంతర్జాలంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం తహసీల్దార్ సంతకం తర్వాత ర్యాంపులోని అధికారి వద్దకు వెళ్లి గుర్తింపు పత్రం తీసుకోవాలి. ఈ ప్రక్రియంతా వినియోగదారులను వ్యయ ప్రయాసలకు గురి చేస్తోంది. ఇంత చేసినా సకాలంలో ఇసుక అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినియోగదారులకు ఆర్థిక 'భారం'
గతంలో రాజమహేంద్రవరంలో 2 యూనిట్ల ఇసుక కావాలంటే లోడింగు మిగిలిన ఖర్చులు కలిపి మొత్తం రూ.2,700 చెల్లిస్తే సరిపోయేది. కానీ ప్రస్తుతం నూతన విధానం వల్ల 2 యూనిట్ల ఇసుకకు రూ.4,175 చెల్లించాల్సి వస్తోంది. సరఫరా ఖర్చులు కూడా పెరిగి వినియోగదారులకు ఆర్థిక భారంగా పరిణమించింది. సకాలంలో ఇసుక అందకపోవడం వల్ల నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ఇనుము, మిగిలిన నిర్మాణ సామగ్రి కూడా పాడవుతోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లోపాలను సరిచేసి సరసమైన ధరలకు సమయానికి ఇసుకను అందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: