తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో స్వామి దర్శన సమయాన్ని అధికారులు పొడిగించారు. ఇకపై ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు స్వామిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతిస్తామని ఆలయ ఈవో తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే స్వామి దర్శనం కల్పించేవారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు.. దర్శన అవకాశం లేక వెనుదిరుగుతున్న కారణంగా.. సమయం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నిబంధనల మేరకు
కలెక్టర్ ఆదేశాల మేరకు నేటి నుంచి సాయంత్రం 6 వరకు భక్తులకు దర్శనాలు కల్పిస్తామని ఈవో తెలిపారు. అయితే భక్తులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. చండీ హోమం, అయుష్య హోమం, నిత్య కల్యాణం వంటి ఆర్జిత సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చని తెలిపారు. కేశ ఖండన సాయంత్రం వరకు కొనసాగుతుందని అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యాన్నదానం, కొండపై భక్తులకు వసతి కేటాయింపు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈవో తెలిపారు. అదే విధంగా కొండపై వివాహాలు, ఉపనయనాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలను తాత్కాలికంగా నిలిపేశారు.
ఇదీ చదవండి: