చిత్తూరు జిల్లా నుంచి విశాఖపట్నం చేరి అక్కడ ప్రేమలో పడ్డ యువకుడు ప్రేమించిన బాలిక కోసం కృష్ణా జిల్లాకు వచ్చి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అందించిన సమాచారం, ఇతర మార్గాల ద్వారా సేకరించిన వివరాల ప్రకారం.. సీతానగరం ప్రకాశం బ్యారేజీ పదో ఖానా వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు వీఆర్వో గుర్తించి సమాచారం ఇవ్వడంతో.. ఆదివారం నది నుంచి మృతదేహన్ని వెలికి తీశామని పోలీసులు తెలిపారు. మృతుని వద్ద లభించిన లేఖ అతని ప్రేమ గాధను బయటపెట్టింది.
ప్రేమ.. పెళ్లి
చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం పుణ్యసముద్రం గ్రామానికి చెందిన బాలాజీగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బత్తయ్య, హైమావతి దంపతులకు బాలాజీ (32) ఒక్కడే కుమారుడు. హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన బాలాజీ తమిళనాడులోని ఓ హోటల్‌లో పని చేశాడు. అనంతరం విశాఖ చేరుకొని ఓ హోటల్లో పనికి చేరాడు. అదే సమయంలో తాడిచెట్లపాలెంకు చెందిన ఓ బాలిక(17)తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె తల్లిదండ్రులు బాలికను విజయవాడలోని ఓ హాస్టల్‌లో చేర్పించారు. విషయం తెలుసుకున్న బాలాజీ కూడా విజయవాడకు మకాం మార్చాడు. కొద్ది రోజులకు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉండేవారు. ఈ నేపథ్యంలో బాలిక కృష్ణా జిల్లా పమిడిముక్కలకు చెందిన మరో యువకుడితో ప్రేమలో పడి అతడ్ని కూడా పెళ్లాడింది. ఈ క్రమంలో బాలాజీ నుంచి ఆమెకు వేధింపులు అధికమయ్యాయి. ప్రేమ వ్యవహారంపై పమిడిముక్కల యువకుడితో గొడవకు దిగాడు. దీంతో వివాదం అక్కడి పోలీసుల దృష్టికి వెళ్లింది. బాలాజీతోపాటు బాలికను పిలిపించి రాజీ కుదిర్చారు. అయినప్పటికీ అతనిలో మార్పు రాకపోవడంతో బాలికను ఆమె తల్లిదండ్రులు విజయవాడ నగర శివారులోని అజిత్‌సింగ్‌నగర్‌లో ఉంటున్న తమ బంధువుల ఇంట్లో ఉంచారు. ఆ విషయాన్ని కూడా తెలుసుకున్న బాలాజీ గత ఏడాది డిసెంబర్‌లో బాలిక ఉంటున్న భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో పోలీసులు బాలాజీని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో బాలిక బాలాజీని వ్యతిరేకించడంతో పోలీసులు ఆమెను తల్లితండ్రుల వెంట పంపించేశారు.
మనస్తాపంతోనే..
తన మాటను పోలీసులు పట్టించుకోలేదని.. మనస్తాపానికి గురయ్యానంటూ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని బాలాజీ తండ్రికి సమాచారం అందించామని ఆయన వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: చిత్తూరు జిల్లాలో 15 మందికి అస్వస్థత..బిర్యానీనే కారణమా ?