YCP Leaders Attacked on RTC Bus in Kuppam: ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరు ప్రాంతాల్లో వైసీపీ అల్లరి మూకలు సృష్టించిన రణరంగం అంతా ఇంతా కాదు. అందులో చాలా మంది వరకు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఆ ఘటన మరువకముందే.. మరోసారి వైసీపీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఈసారి కుప్పంను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డాయి. పుంగనూరు దాడి ఘటనపై వైసీపీ నేతలు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి కుప్పంలో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు.
YCP Leaders Chittoor Bundh: తమిళనాడులోని క్రిష్ణగిరి నుంచి తిరుమల వెళ్తున్న కుప్పం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. ఈ దాడితో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. శనివారం ఉదయం వరకూ బిక్కుబిక్కుమంటూ ఆర్టీసీ బస్టాండ్లోనే గడిపారు. వైసీపీ నేతల దాడిలో ఆర్టీసీ బస్సు పాక్షికంగా దెబ్బతింది.
కాగా పుంగనూరు దాడి ఘటనకు నిరసనగా వైసీపీ బంద్ నేపథ్యంలో.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ముందస్తు ప్రకటన లేకుండా బస్సులు నిలిపివేతతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కుప్పంలో బంద్ పాటించాలంటూ వైసీపీ కార్యకర్తలు దుకాణాలను బలవంతంగా మూసివేయించారు. ఓ వస్త్ర దుకాణంలోని వస్త్రాలను బయటపడేసి బెదిరింపులకు పాల్పడ్డారు.
Students Suffered Due to Chittoor Bundh: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన భాగంగా శుక్రవారం జరిగిన అవాంఛనీయ ఘటనలను ఖండిస్తూ చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు శనివారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి ప్రకటించడంతో చాలా మంది ప్రజలు శనివారం ఉదయం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు పాఠశాలలకు సెలవు అనే విషయం 10 గంటలకు పాఠశాల దగ్గరకు వెళ్లే వరకు తెలియని పరిస్థితి ఏర్పడింది. జిల్లా బంద్ వల్ల కాలేజీ విద్యార్థుల సైతం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అష్ట కష్టాలు పడి ఏదో ఒక వాహనంలో కళాశాల చేరుకుంటే.. 10 గంటలకు ఈరోజు సెలవు అని తెలిసి నిరాశతో వెనుదిరిగారు. బస్సులు నిలిపివేయడంతో పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ బోసిపోయింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయం కోసం గంటల తరబడి రోడ్డుపై వేచి చూడాల్సివస్తోంది.
TDP Leaders Cars Damaged in Punagnur Incident: తంబళ్లపల్లె.. నిన్న అంగళ్లులో జరిగిన దాడి ఘటనలో టీడీపీ నేతల కార్లు ధ్వంసమయ్యాయి. ఘటనలో రైల్వే కోడూరు టీడీపీ సీనియర్ నేత విశ్వనాథ నాయుడు కారు ద్వంసమైంది. ఈ దాడిలో ఐటీడీపీ కార్యకర్త వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డారు.