భర్తను హత్య చేసి ప్రమాదవశాత్తు మరణించినట్లుగా చిత్రీకరించి కేసు నుంచి తప్పించుకునేందుకు యత్నించిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన కేశవ మార్కెట్లో కూలి పని చేసుకొని జీవిస్తుంటాడు. ఈ ఏడాది మే 29వ తేదీ కేశవ మృతి చెందాడు. మద్యం మత్తులో ఇంటి పైనుంచి పడటంతో ప్రాణాలు కోల్పోయినట్లు కేశవ భార్య రేఖ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతుడి తల్లి ఫిర్యాదుతో..
తన కుమారుడు ప్రమాదవశాత్తు మరణించలేదని.. మృతిపై అనుమానం ఉందంటూ కేశవ తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు కేశవ మృతదేహాన్ని శవపరీక్షకు పంపారు. దాదాపు మూడు నెలల తర్వాత వచ్చిన పోస్ట్మార్టం నివేదికలో మర్మాంగం, వృషణాలపై ఒత్తిడి చేయటంతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా పోలీసుల కేశవ భార్యను తమదైన శైలిలో విచారించారు. తానే భర్తను హతమార్చినట్లు ఆమె ఒప్పుకుంది. మద్యం తాగి తరచూ గొడవ పడుతుండే వాడని ఆమె చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మర్మాంగం మీద కొట్టి రేఖ.. తన భర్తను హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడి భార్య రేఖను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
ఇదీ చదవండి: ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం... కాని ఎలా?