చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న తంబళ్లపల్లె, మదనపల్లి,వాల్మీకిపురం, పుంగనూరు, పలమనేరు మండలాల్లో నీటి జాడ కోసం ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో వరద నీటితో కళకళలాడుతున్న నదులతో సుభిక్షంగా ఉంటే... ఇక్కడ మాత్రం చెరువుల్లో చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి.
గత ప్రభుత్వం ఇక్కడి ఇబ్బందులు గమనించి... తంబళ్లపల్లె వద్ద నుంచి కుప్పం వరకూ హంద్రీనీవా కాలువల్లో కృష్ణా జలాలు పారేలా ఏర్పాట్లు చేశారు. అప్పుడే ఎన్నికలు రావడంతో కాలువ పనులు పర్యావేక్షించే వారు కరువయ్యారు. దీంతో పనులు ఆగిపోయి.. నీటి కష్టాలు మెుదలయ్యాయి.
కరెంటు, నీటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తమకు ప్రభుత్వం పరిష్కారం చూపకపోతే వలసే శరణ్యం అంటున్న గ్రామస్తుల గోడు... వినటానికి ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికే పశు పోషణ కష్టమై పాడికి దూరమయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేసి ఇరవై సంవత్సరాలు అవుతుందనీ, హంద్రీనీవా కాలువ నీరు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నామని వృద్ధ రైతులు చెప్తున్నారు.
తంబళ్లపల్లి కోటకొండ వద్ద ఏర్పాటు చేసిన ఏడవ పంపు హౌస్లోకి హంద్రీనీవా కాలువ నీరు ప్రవహించడానికి ఉన్న అడ్డులు తొలగిస్తే ఈ మండలాలు జల సిరితో కళకళలాడుతాయనీ ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : 'తిరుపతి హథీరాం మఠంలో.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత'