చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటుపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. సమగ్రంగా విచారణ జరిపించి సంబంధికులపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. దీంతో పోలీస్ అధికారులు సీసీ ఫుటేజీలతోపాటు పలువురు ఉద్యోగులను విచారిస్తున్నారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా గత మంగళవారం కొందరు భక్తులు భారీ సంచులను చేతపట్టుకుని ఆలయంలోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. కరోనా నేపథ్యంలో ఆలయంలోకి వెళ్లిన భక్తుల వివరాలను నమోదు చేసుకుంటారు. అయితే మంగళవారం భారీ ఎత్తున వచ్చిన భక్తులకు సంబంధించిన వివరాలు ఆలయ అధికారులు నమోదు చేయకపోవడం, దగ్గరుండి ఉద్యోగులు, అధికారులు వచ్చిన వాళ్లను దర్శనానికి తీసుకెళ్లారనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే తనిఖీలు చేయకపోవడం, వచ్చిన భక్తుల వివరాలను నమోదు చేయలేదన్న విషయం స్పష్టమవుతోంది.
మంగళవారం వచ్చిన భక్తులను విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భాజపా, తెదేపా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాయి. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రధానంగా అనుమానం ఉన్న రోజుల్లో విధుల్లో ఉన్న అధికారులు, ఆలయ సిబ్బంది, అర్చకులను విచారించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత ఉద్యోగులకు నోటీసులు సైతం పంపినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణకు నియమించిన కమిటీ సభ్యులు కూడా సంబంధిత ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు