చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలో కలకలం సృష్టించిన ఓపీఎం పోపీ సీడ్స్ సాగు కేసులో మరో ఇద్దరిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం మదనపల్లెలోని మాలేపాడు పంచాయతీలో మత్తు పంటను సాగు చేస్తున్న కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితులు ఇచ్చిన ఆధారాలతో చౌడేపల్లి మండలానికి చెందిన మరో ఇద్దరినీ అరెస్టు చేశారు.
గసగసాల కాయల బెరడు స్వాధీనం....
చౌడేపల్లి మండలం గుట్టకిందపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ అలియాస్ నాగరాజు, కొలిమిపల్లి గ్రామానికి చెందిన రేవణ్ కుమార్ లను ఈ కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. నిందితుల నుంచి 18.10 కేజీల ఎండు గసగసాల కాయల బెరడును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ బెరడును కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారని ఎస్ఈబీ అధికారులు తెలిపారు.
ముమ్మర దర్యాప్తు...
ఎస్ఈబీ ఏఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడెక్కడ ఈ పంటలు సాగవుతున్నాయి అనే కోణంలో అధికారులు డ్రోన్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విత్తనాల పంపిణీలో ఓ మహిళ ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న అధికారులు... ఆమె కోసం గాలిస్తున్నారు. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోనూ ఈ మత్తు పంటల సాగు జోరుగా సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉండడంతో... వాటిని వెలికి తీసేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇదీచదవండి.