తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు ఉదయం అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు తితిదే వెల్లడించింది. వైకుంఠం ద్వార దర్శనం పది రోజుల పాటు కల్పిస్తున్న పాలకమండలి... ఇప్పటికే జనవరి 3 వరకు టికెట్లను భక్తులకు విక్రయించింది. 4వ తేదీ నుంచి నెలాఖరు వరకు సంబంధిత టికెట్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వివిధ స్లాట్లలో రోజుకు 20వేల టికెట్ల చొప్పున అందుబాటులో ఉంచనున్నారు.
ప్రథమ చికిత్స కేంద్రాల పరిశీలన..
శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను జేఈవో బసంత్ కుమార్ పరిశీలించారు. తిరుమల నడకదారుల్లో భక్తులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే చికిత్స అందించేందుకు అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రథమ చికిత్స కేంద్రాల్లో అన్నీ సదుపాయాలు, డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. అంబులెన్స్, వైర్లెస్ సెట్లు అందుబాటులో ఉంచే ఆలోచన చేస్తున్నామన్నారు. మెట్టు మార్గంలో మరో రెండు ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'తితిదేపై అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం'