హైదరాబాద్ కీసరగుట్టలోని తితిదే వేద పాఠశాలను ఈవో జవహర్ రెడ్డి సందర్శించారు. వేద పాఠశాల హాస్టల్ భవనం, తరగతి గదులు, ప్రార్థనా మందిరం, భోజనశాలను పరిశీలించారు. వేదపాఠశాల ప్రధానోపాధ్యాయులతో.. పాఠశాలలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు.
వేద పాఠశాల హాస్టల్ భవనం 40 మంది విద్యార్థుల కోసం నిర్మించారనీ... ప్రస్తుతం 120 మంది విద్యార్థులు ఉంటున్నారని ఈవో దృష్టికి తీసుకువచ్చారు. అదనపు తరగతి గదులు సైతం నిర్మించాల్సిన అవసరం ఉందని వివరించారు. యాగశాల, పాఠశాల పరిసరాల్లోకి వన్య మృగాలు రాకుండా ప్రహారీ గోడ నిర్మించాలని ఈవోను కోరారు. ఈ పనులన్నింటికీ అంచనాలు తయారు చేసి.. పంపించాలని ఇంజినీరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు.
అనంతరం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఈవో... అక్కడ ఉన్న వేద విద్యార్థులతో మాట్లాడారు. తితిదే వేద పాఠశాలలో 8 సంవత్సరాల వేద విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థుల ధ్రువపత్రాలను.. తెలంగాణ దేవాదాయ శాఖ పరిధిలో నిర్వహించే ఉద్యోగ నియామకాలకు అంగీకరించటం లేదని విద్యార్థులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించే పాలకమండలి సమావేశంలో చర్చించి న్యాయం చేస్తామని ఈవో హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: తిరుపతిలో శివుడికి కుంద కుసుమార్చన