టమాటా అంటే గుర్తొచ్చేది చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్. రైతులు తెచ్చే సరకు నిగనిగలాడుతూ.. కనులకు ఇంపుగా.. చూడగానే కొనేట్టుగా ఉంటుంది. ఈ టమాటాలు రైతు బజార్‌లోనో, సూపర్ మార్కెట్లలోనో చూస్తే వినియోగదారుడు బేరాలాడకుండా కొనుగోలు చేస్తాడు. ఇవే టమాటాలను మార్కెట్ యార్డుకు తీసుకెళ్లిన రైతు వద్ద కొనడానికి వ్యాపారులు మాత్రం దారుణంగా బేరాలు ఆడుతున్నారు. మదనపల్లె మార్కెట్‌కు టమాటా తీసుకెళ్లిన రైతుకు కిలో ఎంతరేటు కడుతున్నారు..? ఆరుగాలం శ్రమించిన ఆ రైతుకు చివరికి ఎంత దక్కుతోందో.. చూద్దాం.
శ్రమ దోపిడీ పట్టిక | |
మార్కెట్‌కు తెచ్చింది | 44 క్రేట్‌లు |
ఏరివేతలో మిగిలింది | 34 క్రేట్‌లు |
జాక్‌పాట్ | 1 క్రేట్ |
మిగిలింది | 33 క్రేట్‌లు |
పలికిన ధర | క్రేట్ రూ.70 |
క్రేట్ రూ.70 లెక్కన 33 క్రేట్‌లకు | రూ. 2310 |
కమిషన్ పోను ఇచ్చింది | రూ.1250 |
ముగ్గురు కోత కూలీలకు | రూ.750 |
రైతుకు మిగిలింది | రూ.500 |
రైతు దారి ఖర్చులు | రూ.100 |
మిగిలింది | రూ. 400 |
ఇంట్లో ఇద్దరి కూలి లెక్కేస్తే | రూ.400 |
కష్టానికి ప్రతిఫలం | సున్నా |
టమాటా ధరలు అంతకంతకూ పతనమవుతూ రైతు చేతికి దమ్మిడీ కూడా దక్కడం లేదు. ఫిబ్రవరి 20న మొదటి రకం టమాటాలు పది కిలోల ధర..రూ.252 నుంచి రూ.230 రూపాయలు పలుకగా.. సరిగ్గా నెలరోజులకు, అంటే మార్చి 20కి రూ.90 నుంచి రూ.120లకు పడిపోయింది. మరో నెలకు అంటే ఏప్రిల్ 20కి రూ.74 నుంచి రూ.90ల మధ్యకు పతనమైంది. చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి 50వేల హెక్టార్లలో టమాటా సాగు చేస్తారు. దాదాపు 35వేల రైతు కుటుంబాలు ఈ పంటపైనే ఆధారపడతాయి. కానీ దిగజారుతున్న ధరలు రైతుల్ని ఆందోళనలోకి నెడుతున్నాయి. ప్రస్తుతం మొదటి రకం టమాటా కూడా పది కిలోలు రూ.70 పలకడం లేదు. ఇక సాధారణ రకం టమోటా కిలో రూ.3 నుంచి రూ.2 పలకడమే గగనంగా మారింది. కూలీ, రవాణా ఖర్చులూ దండగేనంటూ.. చాలామంది రైతులు పొలాల్లోనే పంటను వదిలేయాల్సిన నిస్సహాయత నెలకొంది.
పంట రాక పెరగడం వల్లే ధరలు తగ్గాయంటున్నారు అధికారులు. మార్చిలో సగటున రోజుకు 105 మెట్రిక్ టన్నుల టమోటా వస్తే.. ఇప్పుడు 225 మెట్రిక్ టన్నుల టమోటా మదనపల్లె మార్కెట్‌కు వస్తోందంటున్నారు. రాబోయే రోజుల్లో మంచి ధర వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కరోనా ప్రభావం, దశలవారీ లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన.. టమాటా రైతులు ఈసారి ధరల పతనంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ఇదీ చదవండి: గుంటూరు జిల్లా చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్