ఆదాయాన్ని పెంపు మార్గాలపై తిరుపతి నగరాభివృద్ధి సంస్థ (తుడా) దృష్టి సారించింది. తిరుపతి శివార్లలోని శెట్టిపల్లె, రేణిగుంట సమీపంలోని సూరప్పకశం భూముల సమస్యను పరిష్కరించి... ఆధునాతన టౌన్‌షిప్ నిర్మిస్తే ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. శెట్టిపల్లె భూసమస్య పై రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పరిష్కారం కానీ భూములపై ప్రజలకు హక్కు కల్పించి... మిగిలినవి రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకొని తుడాకు అప్పగించనుంది. విమానాశ్రయ సమీపంలోని సూరప్పకశం భూముల్లో టౌన్‌షిప్ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలా వచ్చే ఆదాయంతో.. తుడా పరిధిలోని 6 మండలాలతో పాటు తిరుపతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
తితిదే నిర్వహణలో ఉన్న బర్డ్, స్విమ్స్‌లో పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు. రోగుల సహాయకులు ఇబ్బందుల తీర్చేలా షెడ్లు నిర్మించాలని నిర్ణయించారు. అనేక సమస్యల పరిష్కారం కోసం తుడా పరిధిలోని ఆరు మండలాల తహసీల్దార్, మండల కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్లకు వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అధికారులు అందుబాటులో లేనప్పుడు... కార్యాలయాల వద్ద వేచి ఉండేందుకు ఫిర్యాదుదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికోసం షెడ్లు నిర్మించాలని నిర్ణయించారు.
గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను గ్రామ సచివాలయాలకు అప్పగించనున్నారు. తుడా పరిధిలో పచ్చదనం పెంచేలా ప్రజలను ప్రోత్సహించేందుకు... పండ్ల మొక్కలతో పాటు ఎర్రచందనం మొక్కలు పంపిణీ చేయనుంది.
ఇదీ చదవండి : 'పరువు హత్య కారకులకు శిక్ష తప్పదు'