స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో ఉత్తమనగరంగా .. వరుసగా మూడు సంవత్సరాల పాటు పదిలోపు ర్యాంకులు సాధించిన తిరుపతి నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది. లక్షలాది భక్తులు, పర్యాటకులు వచ్చే తిరుపతిలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ చెత్తమయంగా మారుతున్నాయి. ఇంటింటికీ ఉదయాన్నే వెళ్లి చెత్త సేకరించే కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలుకాకపోవటమే దీనికి కారణం. తోపుడుబండ్లు, ఆటోలు, కాంపాక్ట్ వాహనాల ద్వారా చెత్త తరలించాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలు సక్రమంగా అమలు కావట్లేదు. రోజూ సిబ్బంది రాకపోవటంతో.. ప్రజలు వ్యర్థాలను వీధుల్లో తెచ్చిపడేస్తున్నారు. ఫలితంగా రోడ్లే చెత్తకుండీలుగా మారుతున్నాయి.
తిరుపతి నగరంలోని 50 వార్డులను 20 శానిటరీ డివిజన్లుగా విభజించిన నగరపాలక అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఒక్కో శానిటరీ డివిజన్‌కు పర్యవేక్షకుడితో పాటు 90 మంది పారిశుద్ధ్య కార్యదర్శులను నియమించారు. నగర వ్యాప్తంగా ఇంటింటికీ చెత్త సేకరణకు 800 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. భారీ స్థాయిలో వాహనాలు, సిబ్బంది ఏర్పాటు చేసినా చెత్త సేకరణ సరిగా జరగట్లేదని స్థానికులు వాపోతున్నారు. దీనిపై వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసినా స్పందన ఉండట్లేదని స్థానికులు చెబుతున్నారు.
ఇంటింటికీ చెత్త సేకరణలో గడచిన కొన్నిరోజులుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. నగర పాలక సంస్థ అధికారులు తెలిపారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందని క్షేత్ర స్థాయిలో సిబ్బంది అలసత్వంతో చెత్త వీధుల్లో ఉండిపోయిందన్నారు. క్రమం తప్పకుండా చెత్త సేకరించేలా చర్యలు చేపట్టామని తిరుపతి నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ చంద్రమౌళి రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: వకుళమాత ఆలయంలో బంగారు తాపడం పనులు ప్రారంభం