చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలోని అంకెల గ్రామపంచాయతీకి 20 ఏళ్ల తర్వాత సర్పంచి ఎన్నికలు జరగనున్నాయి. 20 ఏళ్లుగా గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ప్రత్యేక పాలనకు ఇక తెరపడనుంది.
గ్రామపంచాయతీని రెండుగా విభజించాలని ఓ రాజకీయవర్గం, ఒకే పంచాయతీగా ఉంచాలని మరో వర్గం 20 ఏళ్ల క్రితం కోర్టుకెక్కాయి. కోర్టు స్టే కారణంగా 2000 ఏడాది నుంచి సర్పంచి ఎన్నికలు అటకెక్కాయి. అప్పటినుంచి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నేపథ్యంలో అరికెల గ్రామపంచాయతీని అరికెల, మానేవారిపల్లె గ్రామపంచాయతీలుగా విభజించి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
అరికెల పంచాయతీలో అరికెల, కొత్తూరు, దాసిరెడ్డిపల్లె ఎస్సీవాడ, ఎల్లంపల్లె, గోసువారిపల్లె, గౌనివారిపల్లె గ్రామాలున్నాయి. మానేవారిపల్లె గ్రామపంచాయతీలో మానేవారిపల్లె, చిన్నపల్లె, చిట్టెంవారిపల్లె, చీమనపల్లెమిట్ట, నాగనపల్లె, తమకనపల్లె, టి.గొల్లపల్లె గ్రామాలున్నాయి. అరికెలలో 1575 మంది ఓటర్లుండగా, మానేవారిపల్లెలో 1216 మంది ఓటర్లున్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్లో ఈ రెండు గ్రామపంచాయతీలకు సర్పంచి ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో అధికారులు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 27వ తేదీన ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. 20 ఏళ్ల తరువాత ఎన్నికలు జరగనుండటంతో రెండు పంచాయతీ ఓటర్లు ఉత్సాహంతో ఓట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
ఇదీ చదవండి:నామినేషన్ ఉపసంహరణకు రూ.5 లక్షలు