భవిష్యత్ తెలుసుకునేందుకు జ్యోతిష్కుడి వద్దకు వెళ్లిన మహిళ అనుకోని ప్రమాదంతో మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం డీకే మర్రిపల్లిలో జరిగింది. వెదురుకుప్పం మండలం చింతలగుంటకు చెందిన గోవిందమ్మ డీకే మర్రిపల్లిలోని జ్యోతిష్కుడి వద్దకు వెళ్లింది. ఆరుబయట కూర్చుని జ్యోతిష్యం చెప్పించుకుంటుండగా హఠాత్తుగా ఒక ట్రాక్టర్ ఆమె మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ట్రాక్టర్ కిందపడి గోవిందమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.
డ్రైవింగ్ రాని ఓ యువకుడు ట్రాక్టర్ నడిపినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ఆ యువకుడు అక్కడినుంచి పరారయ్యాడు. మహిళ మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన యువకుడిని పట్టుకునేంత వరకు మృతదేహాన్ని తీయమని ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పిన తర్వాత వారు శాంతించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...