CM Jagan Kuppam Tour: వైయస్ఆర్ చేయూత పథకం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం.. చిత్తూరు జిల్లా ప్రజలకు సంకటంగా మారింది. సీఎం అయ్యాక తొలిసారి జగన్ కుప్పంలో పర్యటించారు. అధికార పార్టీ ఆర్భాటపు ఏర్పాట్లు.. ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురిచేశాయి. భారీ జనసమీకరణ కోసం చేసిన యత్నాలు జిల్లా ప్రజలను, ప్రయాణికులను ఇబ్బందులు పెట్టింది. సభకు కుప్పం నుంచి ఆశించిన స్థాయిలో ప్రజలు రాకపోగా.. ఇతర నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని తీసుకొచ్చారు. గంటల తరబడి తిండీతిప్పలు లేక వారంతా విలవిల్లాడారు. ఇలా దాదాపు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలపైనా సీఎం పర్యటన ప్రభావం చూపింది.
ముఖ్యమంత్రి హోదాలో కుప్పంలో జగన్ తొలి పర్యటన.. స్థానికులను తీవ్రంగా ఇబ్బందులపాలు చేసింది. రెండు గంటల పర్యటన కోసం.. రెండు రోజుల పాటు కుప్పం పట్టణవాసులను అధికారులు ఇబ్బందిపెట్టారు.. సీఎం పర్యటన రోజున మరింత కష్టాలకు గురిచేశారు. బహిరంగ సభను పట్టణ శివార్లలో ఏర్పాటుచేసిన అధికారులు.. హెలిప్యాడ్‌ను పట్టణంలో ఏర్పాటు చేసి.. సమస్యలు సృష్టించారు.
బహిరంగసభ ప్రాంతానికి సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసేందుకు స్థలం ఉన్నా.. పట్టణంలో ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక నేతలు ఆధిపత్యం చూపేందుకే పట్టణంలో ప్రదర్శనలు ఏర్పాటు చేశారన్న ఆరోపణలున్నాయి. హెలిప్యాడ్ నుంచి సభ ప్రాంతం వరకు 2 కిలోమీటర్ల మేర బారికేడ్లు, అడుగడుగునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. స్థానిక నేతలు సీఎం ముందు బలప్రదర్శన చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి సీఎం వాహనశ్రేణి వెళ్లే సమయంలో.. ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో.. వాహనాదారులు, పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి వాహనాలను నిలిపివేయడంతో.. తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.
కాన్వాయ్ ట్రయల్ రన్ పేరిట.. రెండ్రోజులు పాటు హడావుడి చేసిన అధికారులు.. సీఎం వచ్చిన రోజన మరింతగా కష్టపెట్టారని.. కుప్పం ప్రజలు అసహనం వ్యక్తంచేశారు. వందల బస్సుల్లో జిల్లా నలుమూలల నుంచి సభకు వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సభ తర్వాత వాహనాలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. వందల బస్సులు రోడ్లపైకి చేరి గంటల తరబడి.. వాహనాల రాకపోకలు స్తంభించాయి.
సభకు భారీ సంఖ్యలో మహిళలను తరలించిన అధికారులు.. వారికి ఆహారం అందించడంలోనూ విఫలమయ్యారు. భోజనం కోసం కొందరు స్థానిక నాయకులతో వాగ్వాదానికి దిగారు. జేసీ వెంకటేశ్వర్ అక్కడికి వచ్చి వారికి సర్ది చెప్పే ప్రయత్నంచేశారు. ఎంతగా శ్రమించినా కొందరికి ఆహారపు ప్యాకెట్లు దక్కలేదు. ప్యాకెట్లలోని ఆహారం పాడైపోవడంతో.. కొందరు అక్కడే పారేశారు. చాలా మంది హోటళ్లకు వెళ్లి భోజనాలు చేశారు. మరికొందరు పస్తులతోనే ఇళ్లకు వెళ్లారు.
సీఎం సభ సందర్భంగా అధికారులు.. తిరుపతి, మదనపల్లె, పుత్తూరు, చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, కుప్పం డిపోల్లోని సుమారు 400 ఆర్టీసీ బస్సులు, పలు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలకు చెందిన 600 వరకు బస్సులు, వాహనాల్లో జనసమీకరణ చేశారు. సీఎం సభ కోసం విద్యాసంస్థలకు అనధికార సెలవు ప్రకటించారు. విద్యార్ధులను.. సీఎం వాహనశ్రేణి వెళ్లే ప్రాంతంలో ప్రదర్శనకు తీసుకొచ్చారు. వారికి అభివాదం చేసుకుంటూ సీఎం సభకు వెళ్లారు. సీఎం సభకు తప్పనిసరిగా రావాలని.. లేకుంటే ప్రభుత్వ పథకాలు రద్దుచేస్తామని.. జరిమానా విధిస్తామంటూ.. దండోరాలు వేయించారు.
ఇక.. సభకు జనాలను తరలించడానికి బస్సులు పంపని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై అధికారులు ప్రతాపం చూపారు. ఆయా పాఠశాలల బస్సులను చిత్తూరులో సీజ్ చేయడం విమర్శలకు దారితీసింది..
ఇవీ చదవండి: