పదో తరగతి పరీక్షల్లో భాగంగా గురువారం హిందీ పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. తెలుగు ప్రశ్న పత్రం లీకైందని..పరీక్షల నిర్వహణలో అధికారయంత్రాంగం వైఫల్యమైందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గురువారం హిందీ ప్రశ్నపత్రం కూడా లీక్ కావడం గమనార్హం. స్థానిక అధికారులు మాత్రం తమ వద్ద లీక్ కాలేదంటూ వివరణలు ఇచ్చారు. ఉదయం 9.30లకు పరీక్ష మొదలవగా 10 గంటల కల్లా ప్రశ్నపత్రం విశాఖ జిల్లాలోని రోలుగుంటలోని ఒక వాట్సాప్ గ్రూపులో తిరిగింది. డీఈఓ లింగేశ్వరరెడ్డి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ రోలుగుంటలో పేపరు లీక్ కాలేదన్నారు.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండల పరిధి తిరుమలయ్యపల్లె ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రం వద్ద బొంతివంక ఎస్సీ కాలనీకి చెందిన ఓ యువకుడు ప్రహరీ దూకి, లోపలి నుంచి ప్రశ్నపత్రాన్ని కిటికీ ద్వారా తెప్పించి చరవాణిలో ఫొటోలు తీసుకున్నాడు. మళ్లీ ప్రశ్నపత్రాన్ని లోపలికి చేర్చి వచ్చేశాడు. ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారం రావడంతో సీఐ చంద్రశేఖర్ అనుమానితులను విచారించడంతో సదరు యువకుడు తాను ప్రశ్నపత్రం ఎలా తెచ్చానో వివరించాడు. ఈ క్రమంలోనే పలువురిని విచారిస్తున్నారు. ‘తిరుమలయ్యపల్లె కేంద్రంలో పేపర్ లీక్ అయిందని వార్తలు రావడంతో విచారణ చేపట్టాం. ఇక్కడ ప్రశ్నపత్రం లీకవలేదు. పరీక్ష ప్రారంభమైన తర్వాత వెలుపలికి వెళ్లినట్లు గుర్తించాం.పూర్తి నివేదికలు అందాక బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం’ అని చిత్తూరు డీఈఓ పురుషోత్తం తెలిపారు. నరసరావుపేటలో పరీక్ష ప్రశ్నపత్రం తెల్లవారుజాము నుంచే వాట్సప్‌లో హల్‌చల్ చేసినట్లు పట్టణంలో వదంతులు వ్యాపించాయి. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై డీఈవో డీవీ రామరాజు దృష్టికి తీసుకెళ్లగా వదంతులు నమ్మవద్దన్నారు.
అది లీకేజీ కాదు మాస్ కాపీయింగ్:నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె పాఠశాలలో జరిగినది.. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కాదని. మాస్ కాపీయింగ్ అని కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డితో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ‘‘27వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఆ పాఠశాలలో తెలుగు పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 10.30 సమయంలో ఓ విద్యార్థినికి చెందిన ప్రశ్నపత్రాన్ని క్లర్కు రాజేష్ ఫొటో తీసి క్రాఫ్ట్ టీచర్ రంగనాయకులకు ఇవ్వగా.. ఆయన పక్క గదిలోని ఉపాధ్యాయులు నాగరాజు, నీలకంఠేశ్వరరెడ్డికి ఇచ్చారు. అక్కడి నుంచి బయట ఉన్న తెలుగు టీచర్లకు చేరగా, వారు జవాబులు తయారుచేసి తిరిగి పంపారు. అదే పాఠశాలకు చెందిన 9 తరగతి విద్యార్థులు నలుగురిని మంచినీటి సరఫరా కోసం నియమించగా, వారితో ఆ జవాబు పత్రాలను 9 గదులకు పంపారు. దీంతో అక్కడి విద్యార్థులు మాస్‌కాపీయింగ్ చేశారు. ఇన్విజిలేటర్లు వారికి అనుమతి ఇచ్చారు. క్లస్టర్ రీసోర్స్‌పర్సన్ మద్దిలేటి ప్రమేయం కూడా ఉంది. నిందితులుగా వెల్లడైన 12 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. వారిలో క్లర్క్ రాజేష్, క్రాఫ్ట్ టీచర్ రంగనాయకులు, బొంతల మద్దిలేటి, కె.నాగరాజు (అబ్దుల్లాపురం జడ్పీ పాఠశాల), నీలకంఠేశ్వరరెడ్డి (గోరుమాన్‌పల్లె), తెలుగు ఉపాధాయులు ఆర్యభట్టు (అబ్దుల్లాపురం జడ్పీ), ఎ.పోతులూరు (గోరుమానుపల్లె జడ్పీ), మధు (చింతలాయపల్లె జడ్పీ), దస్తగిరి (అంకిరెడ్డిపల్లె జడ్పీ), వెంకటేశ్వర్లు (అంకిరెడ్డిపల్లె జడ్పీ), వనజాక్షి (అంకిరెడ్డిపల్లె జడ్పీ), ఎస్.లక్ష్మీదుర్గ (రామకృష్ణ స్కూల్) ఉన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఇన్విజిలేటర్లను ముఖ్య పర్యవేక్షణాధికారి శాఖాపరంగా సస్పెండ్ చేశారు. అన్ని పరీక్షల కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటుచేశాం’ అని పేర్కొన్నారు.
విచారణకు విద్యార్థి నేతల డిమాండ్
పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై విచారణ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విద్యార్థి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. లక్షలమంది విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పరీక్ష మొదలయ్యాక రెండు గంటల తర్వాత లీక్ అయిందని విద్యాశాఖాధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బొత్స స్పందిస్తూ.. ప్రశ్న పత్రం లీక్ కాలేదని, ఇదంతా అసత్య ప్రచారమని వ్యాఖ్యానించినట్టు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ఓబులేష్ తెలిపారు. మంత్రి వివరణ సరిగా లేదని అన్నారు.
ఇదీ చదవండి: Paper leak: శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్..! నిజం కాదన్న డీఈవో