కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవటం సిగ్గుచేటంటూ... చంద్రగిరి తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగు మహిళలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మద్యపాన నిషేధం అమలు చేసేందుకు ఇదే సరైన సమయం అన్నారు. మందుబాబులు లాక్డౌన్ కారణంగా 40రోజుల పాటు మద్యం లేకుండా గడిపారని... ఇలాగే మద్యం షాపులు తెరవకుండా మూసివేస్తే మద్యానికి దూరంగా ఉంటారన్నారు.
మందు తాగకుండా మందుబాబులైన ఉండగలరు కానీ అమ్మకుండా ప్రభుత్వం నడవలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తానన్న సీఎం జగన్ హామీ గాల్లో కలసిందంటూ ఆరోపించారు. మద్యం దుకాణాలు తక్షణమే మూసివేయాలంటూ డిమాండ్ చేశారు. ఈమేరకు తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల్లోని తహసీల్దార్లుకు తెలుగు మహిళలు వినతిపత్రం ఇచ్చారు.