TDP chief Chandrababu Kuppam Constituency Tour updates: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు మొదలైందని, ఇక తరిమికొట్టడమే మిగిలి ఉందని.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నాయకులు పంచభూతాలను మింగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్.. పులివెందుల ప్రజలను భయపెట్టి గెలిస్తే.. తాను మాత్రం కుప్పంలో ప్రజల అభిమానంతో గెలుస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వైసీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత మూడు రోజులుగా కుప్పంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడో రోజు పర్యటనలో ఆయన.. శుక్రవారం రామకుప్పం, శాంతిపురం, కుప్పం గ్రామీణ నాయకులతో, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు.
జగన్ భయపెట్టి గెలిస్తే..నేను అభిమానంతో గెలుస్తున్నా.. ''రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచభూతాలను మింగేశారు. ప్రజల ఇళ్లపై వైసీపీ రాక్షసులు పడతారని గతంలో చెబితే నమ్మలేదు. ఇప్పుడు అదే జరుగుతుంది. విశాఖలో తాజాగా జరిగిన వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ నేటి పరిస్థితులకు ఒక ఉదాహరణ. హుద్ హుద్ తుపాన్ సైతం తట్టుకున్న ఈ విశాఖ.. నేడు అక్రమార్కుల చెరలో విలవిల్లాడుతోంది. రాష్ట్రంలో వ్యక్తులను, ప్రజలను భయపెట్టి జగన్ ఇంతకాలం పాలన చేశాడు. ఇప్పటి వరకూ జనం అన్నీ భరిస్తూ వచ్చారు. ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది. రానున్న రోజుల్లో వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయడమే మిగిలింది. పులివెందులలో ప్రజలను భయపెట్టి జగన్ గెలుస్తున్నారు. నేను కుప్పంలో ప్రజల అభిమానంతో గెలుస్తున్నాను.'' అని చంద్రబాబు నాయుడు అన్నారు.
అలాంటి పరిస్థితి వస్తే నేనే ఎక్కువ బాధపడుతా.. కుప్పంలో నేడు అన్ని అభివృద్ది పనులను జగన్ ప్రభుత్వం నిలిపివేసింది వాస్తవం కాదా..? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాల్సిన బాధ్యత సీనియర్ నేతగా తనపై ఉందని ఆయన గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాలుగా తనను ప్రజలు ఆదరిస్తున్నారన్న చంద్రబాబు.. రాష్ట్రాన్ని గాడిన పెట్టి వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. అందరిలా భయపడి తాను కూడా రాష్ట్రాన్ని వదిలేస్తే.. పూర్తిగా నాశనం అవుతుందన్నారు. అలాంటి పరిస్థితి వస్తే అందరికంటే ఎక్కువ బాధపడేది తానేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
''రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం ఎందుకు పడిపోయిందో చెప్పాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. తెలంగాణకు, ఏపీ మధ్య ఆదాయాల్లో వ్యత్యాసం రూ. 40 వేల కోట్లు. టీడీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ నష్టం ఉండేది కాదు. 2014 తరువాత 5 ఏళ్లలోనే ఎంతో అభివృద్ది చేశాం. మధ్యలో ఓటమిలేకుండా తెలుగుదేశం గెలిచి ఉంటే.. రాష్ట్రం ఎక్కడ ఉండేదో ఊహించండి. రాష్ట్ర అభివృద్ది ధ్యాసలో పడి పార్టీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడం అనేది వాస్తవమే. దీని వల్ల కూడా నష్టం జరిగింది.'' -చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత