స్థానిక ఎన్నికలను ఆరు వారాలు పాటు వాయిదా వేయటం మంచిదేనని పలువురు తెదేపా నేతలు అన్నారు. మళ్లీ ఎన్నికలను నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్నికలు ఎప్పుడైనా విజయం మాదే...
ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెదేపాదే విజయమని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో 82వ వార్డు తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి అర్రేపు లలితకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయడాన్ని ఎమ్మెల్సీ స్వాగతించారు. అధికార పార్టీకి ఎప్పుడు బుద్ధి చెబుదామా అని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసి... చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామన్నారు.
మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి...
రాష్ట్రంలో ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ ప్రకటించి కొత్తగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తెదేపా సీనియర్ నేత, ఎమ్మెల్సీ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ఖాతరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయడం అభినందనీయమన్నారు.
ఎలా బయటకు వస్తాయి..
చిత్తూరు జిల్లా నగిరిలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగడం లేదని నగరి తెదేపా బాధ్యుడు గాలి భానుప్రకాష్ ఆరోపించారు. నగరి, పుత్తూరులో తమ నేతలు దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తీసుకుని వైకాపా నాయకులకు ఇవ్వడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. ఒకసారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లాక బయటకి ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ 6 వారాల పాటు నిలిపివేత