తెలుగుదేశం పార్టీ తలపెట్టిన 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి తరలివస్తున్న నేతలను, కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. చంద్రబాబు నివాసానికి వెళ్లే అన్ని దారులు మూసివేసి ఎవరిని అనుమతించలేదు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి బయలుదేరుతున్న తనను అడ్డుకున్న పోలీసులతో మాజీ మంత్రి లోకేశ్ వాగ్వాదానికి దిగారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిని పోలీసులు గృహనిర్భందం చేశారు. ఉండవల్లి గుహల వద్ద తెదేపా నాయకులు దేవినేని అవినాష్, చంద్రదండు ప్రకాష్‌ను పోలీసులు అడ్డుకోవడంతో వారు అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. వారినీ పోలీసులు అరెస్ట్ చేశారు. తెదేపా అధినేత చంద్రబాబునూ గృహనిర్భందం చేశారు. విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు టీడీ జనార్దన్, మంతెన సత్యనారాయణరాజు అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తెదేపా శాసన సభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, అమర్‌నాథ్ రెడ్డి, రామరాజు, జయనాగేశ్వర్‌రెడ్డి తదితరులను చంద్రబాబు నివాసం వద్దే పోలీసులు అడ్డగించారు. తెలుగుదేశం నాయకులు అరెస్టులను ఖండిస్తూ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.
విశాఖ నుంచి విజయవాడ చేరుకున్న మాజీమంత్రి, సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద్, వెలగపూడి రామకృష్ణ బాబులను విజయవాడ రైల్వేస్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకుని పున్నామి ఘాట్‌కు తరలించారు. అనంతపురం నుంచి అమరావతి బయలుదేరిన కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని మార్గమధ్యలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణ-గుంటూరు జిల్లాల తెలుగుదేశం నాయకులను వారి వారి నివాసాల్లోనే గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పార్టీ నేతలు వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు బుద్ద వెంకన్న, అశోక్ బాబు, రాజేంద్రప్రసాద్‌లను గృహ నిర్భంధం చేశారు. చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావును, కరణం వెంకటేష్‌ను పోలీసులు తమ ఇంట్లోనుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ అరెస్టులు, గృహ నిర్బంధ ప్రక్రియ కొనసాగింది.
ఇదీ చూడండి:జియోలాజికల్ ట్రైనింగ్ బృందాన్ని అడ్డుకున్న విద్యార్థి జేఏసీ