YSRCP MP Mithun Reddy Fires on Chandrababu: గత కొన్ని రోజులుగా కుప్పం నియోజకవర్గంలోని రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ నేతల ఆరోపణలు, టీడీపీ నేతల కౌంటర్లతో కుప్పం రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చంద్రబాబుపై చేసిన ఆరోపణలపై టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ స్పందించారు. వైసీపీ నాయకులకు దొంగ ఓట్లు గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు.
కుప్పంలో గెలిచే దమ్ము లేక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెదేపా నాయకులు మండిపడ్డారు. కుప్పంలో బోగస్ ఓట్లు ఉన్నాయంటూ వైసీపీ ఎంపీ మాట్లాడటంపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, తెదేపా జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. బోగస్ ఓట్లకు నాంది పలికిందే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అని ఆరోపించారు. ఎన్నికలకు భయపడి ఏకగ్రీవం చేసుకునే వైసీపీ కూడా ఓట్లు, ఓటర్లు గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. పుంగనూరులో నిజమైన ఓటర్లు ఓటు వేసుకోకుండా అడ్డుకునే వాళ్లు బోగస్ ఓట్ల గురించి మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ నాయకులకు దొంగ ఓట్లు గురించి మాట్లాడే అర్హత లేదని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా వైసీపీ ప్రభుత్వం కల్పించలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన నాయకుల ముఖాలు కూడా ప్రజలకు తెలియని పరిస్థితి ఉందని, వైసీపీ ప్రభుత్వం ఇందుకు సిగ్గుపడాలన్నారు.
'గడిచిన ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబు గెలుస్తున్నారు. మీరు పుట్టకముందు నుంచి చంద్రబాబు గెలుస్తున్నారు. అసలు దొంగ ఓట్లను గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదు. కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్ల వల్ల గెలుస్తున్నారని చెప్పడం హాస్యాస్పదం. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల ఓట్ల ద్వారా గెలవాలి కానీ.. మీలా ఆరోపణలతో గెలవాలనుకోకూడదు. చంద్రబాబు గత ముప్పై సంవత్సరాల నుంచి కుప్పంలో గెలుస్తున్నారు. చంద్రబాబును ఓటమి పాలు చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బోగస్ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేసింది మీరు. ప్రజలకు తెలుసు. మెుదట పుంగనూరులో స్వంతంగా గెలిచి పక్కన ఉన్న నియోజకవర్గాలపై స్పందించాలి. రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఈ ఇద్దరూ వాళ్లు చేసే పనులను చంద్రబాబుకు ఆపాదించాలని చూస్తున్నారు.'- అమర్నాథ్ రెడ్డి, మాజీ మంత్రి
ఇవీ చదవండి: