చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు వద్ద తెదేపా నేతలపై జరిగిన దాడిని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కిరాయి మనుషులతో ఎదుటి వారిని భయపెట్టి బెదిరించి ప్రలోభాలకు గురి చేయడం ముఖ్యమంత్రి జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు వెన్నతో పెట్టిన విద్యని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి కలికిరిలో అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్‌ను ఓడిస్తామని మాజీ మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులన్నీ గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారాయని.... వైకాపా నేతలు జిల్లాలో అభివృద్ధిని పక్కనబెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారని అమర్నాథ్ రెడ్డి విమర్శించారు.
ఆంగళ్లులో జరిగిన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయిందని... ఫుటేజ్‌ను పరిశీలిస్తే నిందితులెవరో గుర్తించవచ్చని పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించే శక్తి పెద్దరెడ్డికి లేదన్నారు. ప్రభుత్వం మీద విశ్వాసం లేక స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: వైకాపా, తెదేపాపై సర్జికల్ స్ట్రైక్స్ అవసరం: ఎంపీ జీవీఎల్