'తెలుగుదేశం పార్టీ రెండేళ్లకోసారి ప్లీనరీ నిర్వహించుకొని.. ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షులను ఎన్నుకుంటుంది. వైకాపా అద్దె మనుషులతో ప్లీనరీ నిర్వహించింది. ఏం సాధించారని ప్లీనరీ నిర్వహిస్తున్నారు?' అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. 'బాదుడే.. బాదుడు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లా నగరి, కార్వేటి నగరంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. 'మొన్నటివరకూ అందరినీ వాడుకున్నారు. మొన్న చెల్లి పార్టీని వదిలివెళ్లింది. ఇప్పుడు తల్లి వంతు వచ్చింది. బాబాయిని హత్య చేయించారు. జగన్ మాదిరిగా ఇటువంటి పనులు ఎవరైనా చేయగలరా? గౌరవాధ్యక్షురాలిగా ఉన్న తన తల్లి విజయమ్మతో జగన్ రాజీనామా చేయించారు. ఈయన వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా ఉంటాడంట. అందుకు తీర్మానం చేయించుకుంటారంట. ఆ పార్టీలో ఇక ఎన్నికలే ఉండవంట. ఎవరికైనా ఇటువంటి చెత్త ఆలోచనలు వచ్చాయా? అది ఒక పార్టీనా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం?' అని ప్రశ్నించారు.
మద్యంపై సమాధానం చెప్పండి?
'ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యంలో విష పదార్థాలు ఉన్నాయని పరీక్షల్లో తేలింది. దీనిపై మీ పార్టీ ప్లీనరీలో సమాధానం చెప్పండి. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకే సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించినప్పుడూ పరదాలు కట్టుకుని తిరిగారు. సామాన్యుల జేబులకు ఈ ప్రభుత్వం కన్నం వేస్తోంది. అన్ని వృత్తులపైనా పన్ను విధిస్తున్నారు. పనులు చేయకుండా.. ఎడాపెడా పన్నులు విధిస్తూ దోపిడీ చేస్తున్నారు. మీ ఆస్తులేమో పెరగాలా? ప్రజల సంపద మాత్రం తగ్గాలా?' అని తెదేపా అధినేత చంద్రబాబు.. సీఎం జగన్‌ను ప్రశ్నించారు.
నా పైనా కేసు పెడతారట
'వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా.. గాలేరు- నగరి, హంద్రీ- నీవా, సోమశిల- స్వర్ణముఖి లింక్ పనులు పూర్తి కాలేదు. రాష్ట్రానికి ప్రాణాధారమైన పోలవరాన్నీ వదిలేశారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరానికీ నీరందించాలన్నది నా కల. రాయలసీమను సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నేను ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే.. నదుల అనుసంధానం జరిగి ఉండేది. జగన్ 100 శాతం ప్రజలను మోసం చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను ఈ ప్రభుత్వం పారదర్శకంగా ప్రకటించగలదా? అభివృద్ధి పనులు చేయకపోగా.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. పెగాసస్ ఉపయోగించారని నాపై కూడా కేసు నమోదు చేస్తారంట. నేను తప్పు చేస్తే ప్రజలకు భయపడతాను తప్ప కేసులకు కాదు' అని చంద్రబాబు అన్నారు.
రైతులు తిరుగుబాటుకు సిద్ధం కండి
'ఈ ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ తెదేపా అధికారంలోకి వచ్చాక సరిదిద్దుతా. మరమగ్గాల కార్మికులకు తమిళనాడులోలా 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందిస్తా. మోటార్లకు మీటర్లు పెట్టడానికి వస్తే రైతులంతా పోరాటం చేయాలి. నేను అండగా ఉంటా.. అన్నదాతలంతా తిరుగుబాటుకు సిద్ధంగా ఉండండి' అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా రేణిగుంట నుంచి నగరి వరకు తెదేపా శ్రేణులు, తెలుగు యువత నాయకులు వర్షంలోనూ భారీ ర్యాలీగా పాల్గొన్నారు. తమిళనాడులోని పళ్లిపట్టులోనూ తెదేపా అధినేత చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. కార్వేటి నగరంలో జరిగిన రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతూ 'అసత్యాలు ప్రచారం చేసేందుకు ఒక్కో వాలంటీర్‌కు రూ.200 ఇచ్చి సీఎం జగన్ సాక్షి పత్రిక కొనిపిస్తారట' అని ఎద్దేవా చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే డీఎస్సీ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. 'కార్వేటినగరం మండలం గోపిశెట్టిపల్లె గ్రామానికి చెందిన శంకర్ తెదేపా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతంతో దుర్మరణం చెందడం తీవ్ర ఆవేదన కలిగించింది. పార్టీ తరఫున రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాం' అని అన్నారు.
"జగన్ ప్రభుత్వం పది వేల పాఠశాలలను రద్దు చేసింది. పేద విద్యార్థులు చదువుకోవాలంటే.. వాగులు, వంకలు దాటి బడులకు చేరుకోవాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2.50 లక్షలమంది విద్యార్థులు.. చదువులకు దూరమయ్యారని కేంద్ర నివేదిక స్పష్టం చేస్తోంది. ఇప్పుడు బడి మానేసే వారి సంఖ్య మరింత పెరుగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు ఆందోళనలకు దిగుతున్నారు. కడుపు కాలి వారు రోడ్డెక్కితే.. ఇదీ నా పనే అని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. చివరకు భార్యాభర్తలు కాపురం చేయకపోయినా నేనే కారణమంటారా?"
- తెదేపా అధినేత చంద్రబాబు
ఇదీ చూడండి : కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఎంపీ రఘురామ లేఖ.. సీఎం జగన్ పేషీపై ఫిర్యాదు