చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో చదువు చెప్పే ఉపాధ్యాయుడు ఒకరు బదిలీపై పంచాలమర్రికి వెళ్లారు. ఆయన చదువులు బాగా చెప్తారనే పేరున్నందున... ఆయనతోపాటే విద్యార్థులు టీసీలు తీసుకొని పంచాలమర్రి పాఠశాలలో చేరిపోయారు. తంబళ్లపల్లి మండల కేంద్రానికి 4కిలోమీటర్ల దూరంలోని పంచాలమర్రి ప్రాథమిక పాఠశాల ఉంది. అయినా వారికి ఇది పెద్ద దూరం కాలేదు. మంచిగా బోధించే ఉపాధ్యాయుణ్ని వదులుకోలేక ఇలా చేశారు. ఒకప్పుడు 20 మందితో ఉండే పంచాలమర్రి పాఠశాల... తంబళ్లపల్లె విద్యార్థుల రాకతో ఆ సంఖ్య 50కి పెరిగింది.
కలెక్టర్ ప్రశంసలు
కరవు పరిస్థితులపై పరిశీలనకు వచ్చిన కలెక్టర్ పంచాలమర్రి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల చదువు, ఉపాధ్యాయుల పనితీరు సంతృప్తికరంగా ఉండటంతో అభినందించి సత్కరించారు. ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఈ పనులు పూర్తైనందున ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, యువసేన సభ్యులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పాఠశాల అభివృద్ధికి అంతా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:నిలిచిన గరుడ వారధి- స్థానికుల అసంతృప్తి