రోజురోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతుండటంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గడిచిన రెండు నెలల వ్యవధిలోనే ఆరుగురు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఆలయంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న పార్థసారథి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వరుస సంఘటనలతో ఆలయ సిబ్బంది మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు కరోనా ఉన్నా.. పెద్దగా జాగ్రత్తలు పాటించని అర్చకులు, పరిచారకులు, వేద పండితులు, ఉద్యోగులు.. ప్రస్తుతం మాస్కులు లేకుండా కనిపించడం లేదు. చాలా అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ క్రమంలో పలువురు ఉద్యోగులు దీర్ఘకాల సెలవులు పెడుతున్నారు. కరోనా ప్రభావం దృష్ట్యా ఆలయ ఆవరణంలోనూ తరచూ రసాయనాలను పిచికారి చేస్తున్నారు. గత వారం రోజులుగా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో పాతిక వేల మందికి పైగా ఆలయానికి వస్తుండగా ప్రస్తుతం 5 వేలలోపే దర్శనానికి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దర్శన వేళలు కుదింపు విషయమై ఆలయ అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.
ఇవీ చూడండి...