చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. తోటి విద్యార్థుల సరదాకు ఆరేళ్ల బాలుడి ప్రాణాలు కోల్పోయాడు. ఒకటో తరగతి చదువుకున్న హర్షవర్థన్.. ఈ నెల 14న ఆడుకుంటూ మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. అంతలో తోటి విద్యార్థి బయట గడియపెట్టాడు. అప్పటికే పాఠశాల గంట కొట్టగా.. అతను శౌచాలయ తలుపు గడియ తీయటం మరిచిపోయి వెళ్లిపోయాడు. ఉపాధ్యాయులు, పాఠశాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరూ పట్టించుకోలేదు.. పిల్లాడి ఏడుపు విన్న ఓ మహిళ శౌచాలయం తలుపు గడియ తీసింది. అప్పటికే పిల్లాడు నీరసించిపోయాడు.
పరిస్థితి తెలుసుకున్న ఉపాధ్యాయులు పిల్లాడిని ఇంటికి పంపించేశారు. భయాందోళనకు గురైన హర్షవర్థన్‌కు జ్వరం వచ్చింది. బాలుడికి తల్లిందండ్రులు ధైర్యవచనాలు చెబుతూ సాంత్వన చేకూర్చారు. తోటి పిల్లల మధ్య తిరిగితే భయాన్ని మర్చిపోతాడని స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు పాఠశాలకు పంపారు. అయినా బాలుడికి జ్వరం తగ్గకపోగా మరింత పెరిగింది. ఆదివారం ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే హర్షవర్ధన్ చనిపోయాడని తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. ఘటనపై మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ విచారణకు ఆదేశించారు. ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వలంటీర్‌ను సస్పెండ్ చేశారు. ఘటనపై వివరణ కోరుతూ ప్రధానోపాధ్యాయురాలు భారతికి మెమో జారీ చేశారు.
ఇదీ చదవండి: