తిరుమలలో కలకలం సృష్టించిన కిడ్నాప్ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తితిదే పాలకమండలికి చెందిన ఓ సభ్యుడి పేరును నిందితులు వాడుకున్నట్టు విచారణలో తేలింది. ఆయన పేరు చెప్పే కొండపైకి వచ్చారని తిరుమల ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. అప్పుగా ఇచ్చిన రూ. 20 లక్షలు వసూలు కోసమే బాధితుణ్ని అపహరించాలని పథకం వేసినట్టు పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంవాసి హనుమంతరావు... అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన శ్రీనివాస్ వద్ద రూ.20 లక్షల రుణం తీసుకున్నారు. లాక్ డౌన్ కారణంగా వాటిని తిరిగి ఇవ్వలేకపోయాడు. ఆ డబ్బు వసూలు కోసం తీవ్రంగా ప్రయత్నించిన శ్రీనివాస్... చివరకు కిడ్నాప్ చేయడానికి యత్నించాడు.
కుటుంబంతో తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి హనుమంతరావు వెళ్లాడని తెలుసుకున్న శ్రీనివాస్... అక్కడే కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు.
కొంతమందిని పురమాయించి తిరుమలలో ఆయన్ని అపహరించే ప్రయత్నం ఆదివారం చేశారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు... ఘాట్ కిందికి దిగేలోపు నిందితులను అరెస్టు చేశారు.
నిందితులు కొండపైకి ఎలా వచ్చారన్న ప్రశ్నకు తితిదే పాలకమండలి సభ్యుడి కోటాలో టిక్కెట్లున్నాయని వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు పోలీసులు. నిందితులను రిమాండ్‌కి తరలిస్తున్నట్లు తెలిపిన ఏఎస్పీ..పూర్తి వివరాలను విచారణ పూర్తి చేసిన అనంతరం వెల్లడిస్తామన్నారు.
ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి 20 నిమిషాల్లోపే నిందితులను గుర్తించి పట్టుకునేందుకు సహకరించిన రక్షక్ కానిస్టేబుళ్లకు ఏఎస్పీ రివార్డు అందజేశారు.
ఇవీ చూడండి...