బియ్యం బస్తాల మాటున ఎర్రచందనం తరలిస్తున్న 13 మంది స్మగ్లర్లను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రూ.1.5 కోట్ల విలువైన దుంగలను, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సెంథిల్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం... పీలేరులోని పొంతల చెరువు మలుపు దగ్గర ఆదివారం వేకువజామున కంటెయినర్ సహా ముందు, వెనుక పైలట్‌గా వెళ్తున్న వాహనాలను పీలేరు సీఐ సాదిక్‌అలీ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం తనిఖీ చేసింది.
కంటెయినర్‌లో బియ్యం బస్తాల మాటున 3.5 టన్నుల బరువున్న 115 దుంగలను గుర్తించింది. వీటిని అక్రమంగా రవాణా చేస్తున్న కడప జిల్లాకు చెందిన సురేంద్రరెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, తిరుపతికి చెందిన అప్పలిమురళి, రామాంజులు, వికేష్, తమిళనాడు వాసులైన స్వామినాథన్ సంజీవ్, విజయకాంత్, శక్తివేల్, విజయ్‌కుమార్, ఏలుమలై, వెలుస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. దుంగలను తీసుకోవడానికి రాణిపేటలో ఇద్దరు వేచి చూస్తున్నట్లు విచారణలో పోలీసులకు నిందితులు చెప్పారు. వెంటనే ప్రత్యేక బృందం రాణిపేట వెళ్లి హరిమూర్తి, వెంకటేష్ అలియాస్ బాబును అరెస్టు చేశారు. నిందితుల్లో ఒక ఉపసర్పంచి, వార్డు సభ్యుడొకరు ఉన్నట్లు సమాచారం.
ఇదీచదవండి: Viral Video: 'ఏయ్..పని ఆపెయ్..' గుత్తేదారుకు వైకాపా నేత బెదిరింపులు