![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో ఓ చిన్న గ్రామం రాజనాల బండ. రాజీ, న్యాయాల బండగా పేరుగాంచిన ఈ క్షేత్రం కాలక్రమేణా రాజనాల బండగా మారింది. ఊరిలో నరసింహుని కొండపై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రపాలకుడిగా వీరాంజనేయుడి ఆలయం ఉంది. అయిదు శతాబ్దాల క్రితం పుంగనూరు జమీందారులు ఈ ఆలయాన్ని నిర్మించారని గ్రామస్థులు అంటున్నారు.
ఈ గ్రామంలో ఏ తప్పు జరిగిన న్యాయం కోసం రాజనాల వీరాంజనేయుని బండ దగ్గరకే వస్తారు. ఎవరైనా తప్పు చేస్తే స్వామికి రశీదు కట్టాం అంటే చాలు..దోషి తన తప్పు ఒప్పుకుంటాడు. ఇదీ ఆ బండ ప్రత్యేకత. రాజనాల బండపై నిలబడి నిజమే పలకాలి, ఒకవేళ అబద్ధం చెప్తే కీడు జరుగుతుందని గ్రామస్థుల నమ్మకం. దాదాపు అయిదు వందల సంవత్సరాలుగా గ్రామ ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారని దేవాలయ అర్చకులు చెబుతున్నారు. ప్రజలు ధర్మమార్గంలో నడవటానికి ఈ ఆలయం కీలక పాత్ర వహిస్తుందని అంటున్నారు.
గ్రామంలో ఏ తప్పు జరిగిన ఆలయ ప్రధాన పూజారే ఊరి పెద్దగా వ్యవహరించి న్యాయం చెబుతారు. స్వామి వారికి రశీదు కట్టి..ఆ సంగతి ఊరిలో చాటింపువేస్తారు. తప్పు చేసిన వారు ఒప్పుకుంటే సరే..లేదంటే శనివారం రోజున రాజనాల బండపై సత్యప్రమాణం చేయవలసి ఉంటుందని దండోర వేయిస్తారు.
ఆ ప్రకటనే చాలు దొంగలించబడిన వస్తువులు తిరిగి ప్రత్యక్షమవుతాయి. గొడవలు, తగాదాలు సర్దుకుంటాయి. ఊరిలో నూటికి 90 శాతం కేసులు ఈ విధంగానే సమసిపోతాయంటున్నారు గ్రామస్థులు. తప్పు చేయని వారు తమ నిజాయితీని నిరూపించుకోవడానికి ఆలయ పుష్కరిణిలో స్నానంచేసి స్వామి పీఠంపై నిలుచుని పంచభూతాల సాక్షిగా సత్యప్రమాణం చేస్తారు.
పీఠంపై నిలబడి అబద్ధం చెప్తే వారికి కీడు జరుగుతుందని గ్రామస్థుల నమ్ముతారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ఇందుకు ఉదాహరణగా చెప్తుంటారు.
కుల,మతాలకు అతీతంగా ప్రతీ శనివారం తీర్పు కోసం పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తుంటారు. ఊరి సంప్రదాయాలు, కట్టుబాట్లకు విలువనిస్తూ...నేటికీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తుంది రాజనాల బండ.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)