విద్యుత్ సరఫరా వ్యవస్థలో భద్రతా లోపాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఎక్కువ మంది పెద్ద దిక్కును కోల్పోయి జీవనాధారం భారం అవుతోంది. పశువులు కూడా మృత్యువాత పడి.. వీటి ఆధారంగా జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయి. ప్రాణ నష్టానికి ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం సరిగా అందడం లేదు. చిత్తూరు జిల్లాలో రెండేళ్లుగా 156 మంది వరకు క్షతగాత్రులయ్యారు. ప్రాణాలు కోల్పోయిన 21 కేసుల్లో బాధితులకు పరిహారం అందలేదు. ఈ ఏడాది ఎనిమిది మంది మృత్యువాత పడగా... బాధిత కుటుంబాల్లో ఒక్కరికి కూడా పరిహారం అందించిన దాఖలాలు లేవు.
●వెదురుకుప్పం మండలం వేపేరి గ్రామానికి చెందిన ఖాసీం(42) గత ఏడాది సెప్టెంబరు 19న ట్రాక్టరుతో పొలం దున్నుతుండగా విద్యుత్ తీగలు పడి అక్కడికక్కడే చనిపోయాడు. కరెంటు తీగలు కిందకు ఉండడంతో ప్రమాదం జరిగింది. ఆయన మృతితో భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఆదరణ కోల్పోయారు.
●సత్యవేడులో ఒప్పంద కార్మికుడు సురేష్ విధుల్లో భాగంగా విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. సంస్థ తరపున ఎలాంటి సాయం అందలేదు. ఏడాది కిందట ఘటన జరిగినా ఇప్పటికీ నయాపైసా రాలేదు.
●కురబలకోట మండలం దిగువ బోయనపల్లెకి చెందిన వి.నరసింహులు(45) ఆటో డ్రైవర్‌గా పని చేసేవారు. కరోనా కర్ఫ్యూ కారణంగా ఆటో నడిపే పరిస్థితి లేకపోవడంతో కూలీ జీవనం మొదలుపెట్టారు. గ్రామానికి సమీపంలో నేరేడు కాయలు కోస్తుండగా చెట్టు కొమ్మల మధ్య ఉన్న విద్యుత్ తీగలు తగలి గతనెల 31న మృతిచెందాడు. మృతుడి భార్య కళావతి, కుమారులు జస్వంత్(18), లక్ష్మణ్(15) పెద్ద దిక్కును కోల్పోయారు. కుటుంబం ఇప్పటికీ కోలుకోలేదు.
ఈ ముగ్గురే కాదు.. కరెంటు కాటుతో ఎంతో మంది బలయ్యారు. పశువులు కూడా మృత్యువాత పడ్డాయి.
కనికరించక.. కన్నీరు
ఆరేళ్ల కిందట భర్త సుబ్రమణ్యంరాజు(29) పొలంలో విద్యుత్ షాక్ తగిలి చనిపోయారు. ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ సమయంలో ఏడు నెలల గర్భిణిగా ఉన్నా. బిడ్డను తోడు పెట్టుకుని ఆర్థిక సాయం కోసం పలుసార్లు అధికారుల చుట్టూ తిరిగా.ఎక్కడా న్యాయం జరగలేదు. ఇద్దరు బిడ్డల షోషణ కష్టంగా ఉంది. ఎన్ని వినతులు అందించినా.. ఫలితం లేదు. ఆరేళ్లుగా కన్నీరు ఆగడంలేదు. - లోకేశ్వరి, టీవీఎన్‌ఆర్ పురం, పాలసముద్రం మండలం
ఆవు దూరమై.. జీవనాధారం భారమై
మదనపల్లె గ్రామీణ మండలం వేంపల్లె పంచాయతీ సాముల ఇండ్లు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి(70) వృద్ధాప్యంలో పాడి ఆవుతో జీవనం సాగిస్తున్నారు. గ్రామ సమీపంలోని పొలంలో ఉన్న విద్యుత్ తీగలు తగులుకుని ఆవు మృత్యువాత పడింది. జీవనాధారమైన పశువు మృతి చెందడంతో రైతు ఇప్పటికీ విలపిస్తున్నారు. పాలు అమ్మి జీవవనం సాగించే రైతు ధీనస్థితిలో బతుకుతున్నారు. ప్రభుత్వ సాయం అందలేదు.
ఎస్పీడీసీఎల్ నిర్లక్ష్యం
తరచూ విద్యుత్ సరఫరా లైన్లను పరిశీలించడం, వేలాడుతున్న తీగలను సరిచేయడం, కొమ్మలు కత్తిరించే విధానం అమల్లో ఉండగా అక్కడక్కడ నిర్లక్ష్యంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నియంత్రికల ఏర్పాటులో ప్రమాణాలు పాటించకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. లైన్ల విషయంలో కింది స్థాయి సిబ్బంది పట్టించుకోకపోవడం, పర్యవేక్షణాధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకపోవడంతో ఘటనలు జరుగుతున్నాయి.
అవగాహన, నిఘా ముఖ్యం
విద్యుత్ ప్రమాదాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. అప్రమత్తంగా వ్యవహరించాలి. సిబ్బంది కూడా సరఫరా వ్యవస్థపై నిఘా ఉండాలి. పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. మరణాలు సంభవిస్తే... నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. - చలపతి, ఎస్‌ఈ, ఎస్పీ డీసీఎల్, తిరుపతి వలయం
ఇదీ చదవండి: maoist letter: ప్రభుత్వ విధానాలపై.. మావోయిస్టుల నిరసన లేఖ!