చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం మాలేపాడులో... పంటపొలాల మధ్య మాదకద్రవ్యాల్లో వినియోగించే గసగసాల సాగు కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారంతో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సిబ్బంది ఆకస్మిక తనిఖీలు జరపగా... అల్లనేరేడు, మామిడి పంటల మాటునే అంతరపంటగా ఓపియం పాపీ సీడ్స్ సాగవుతున్నట్లు గుర్తించారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో ట్రాక్టర్‌తో దున్నేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. సుమారు 2 లక్షల రూపాయల విలువైన గసగసాల పంటను కోయించి తగలబెట్టారు. వారిచ్చిన సమాచారంతో పంట వేసిన నాగరాజు అనే వ్యక్తినీ అదుపులోకి తీసుకొని కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
ఓపియం పాపీ సీడ్స్ అంటే..?
ఓపియం పాపీ సీడ్స్ అని పిలిచే గసగసాలను.... హెరాయిన్, నల్లమందు లాంటి మాదకద్రవ్యాల తయారీలో వినియోగిస్తారు. మనదేశంలో ఈ పంటను నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ వ్యవహారంపై అసలు నిందితుడిని ప్రశ్నించగా... చౌడేపల్లి మండలానికి చెందిన వ్యక్తి ప్రోద్బలంతో సాగు చేస్తున్నట్లు తెలిపాడు. ముంబై నుంచి విత్తనాలు తీసుకొచ్చినట్లు భావిస్తున్న అతడినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై, బెంగుళూరుకు చెందిన డ్రగ్స్ ముఠాలు వీరి వెనుక ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సూత్రధారుల వేటలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో జిల్లాలో మరెక్కడైనా ఈ పంటను సాగు చేస్తున్నారా అనే కోణంలో అధికారులు దృష్టి సారించారు. ఐదేళ్ల క్రితం పుంగనూరు, చౌడేపల్లిలో పెద్దమొత్తంలో బయటపడిన మత్తుమందు పంటల కేసులనూ తిరగేస్తున్నారు.