భూమి చుట్టూ ఆవరించిన వాయు మండలంలో నిత్యం చోటు చేసుకునే పరిణామాలు, పర్యవసానాలపై అధ్యయనానికి మారుపేరుగా నిలిచింది... జాతీయ వాయు మండలీయ పరిశోధన ప్రయోగశాల(ఎన్‌ఏఆర్‌ఎల్). ప్రపంచ స్థాయి వాతావరణ పరిశోధనా ప్రయోగశాలగా, నూతన ఆవిష్కరణలకు వేదికగా భాసిల్లుతోంది. భూమి లోపల 100 సెంటీ మీటర్ల లోతు నుంచి ఉపరితలంపై సుమారు 500 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉష్ణోగ్రత, గాలివేగం తదితర పరిణామాలను అత్యంత కచ్చితంగా నమోదు చేయగలుగుతుంది. చిత్తూరు జిల్లా పాకాల మండలం గాదంకి కేంద్రంగా 1993లో ఎంఎస్‌టీ రాడార్‌తో అవతరించి అంచెలంచెలుగా ఎదుగుతోంది. రానున్న తుపాన్లు, వ్యవసాయ, వాతావరణ సూచనలతో సాధారణ ప్రజలకు తనవంతు సేవలందిస్తోంది.
- శ్రీహరికోట నుంచి రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించాలంటే క్షేత్రస్థాయి నివేదిక అవసరం. నివేదిక ఇచ్చేది... జిల్లాలో ఉన్న ఎన్‌ఏఆర్‌ఎల్.. దీన్ని జిల్లా వాసులు రాడార్‌గా పిలుచుకుంటారు.
- ఎన్‌ఏఆర్‌ఎల్.. జిల్లా వాసులకు వరంగా.. ఇక్కడ ఏర్పాటైంది. దీన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ నెలకొల్పింది. అటు పరిశోధనలు సహా పలు విభాగాల్లో స్థానికులకు ఉపాధి కల్పించింది.
- ఎక్స్-బ్యాండ్ డ్యూయెల్ పోలరైజేషన్ రాడార్ భవనంపై ఉన్న గ్లోబు నుంచి ఆకు పచ్చని రంగులో కిరణాలు ఆకాశంలోకి వెళ్తుంటాయి. ఈ విషయం జిల్లా సహా పరిసర ప్రాంత ప్రజలకు తెలుసు. అందరూ దీన్ని రాడార్ అని పిలుస్తారు. వాస్తవంగా వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు.. వర్షపాతం స్థితిగతులు.. ఇలా అన్నీ దీని ద్వారానే కచ్చితత్వంతో వివరాలు వెల్లడిస్తారు.
యువ శాస్త్రవేత్తల సహకారం..
ఎన్‌ఏఆర్‌ఎల్ శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనలను సాగిస్తూనే.. బయటి యూనివర్సిటీల నుంచి వచ్చే యువ శాస్త్రవేత్తల ప్రయోగాలకు సహకరిస్తోంది. కేంద్రంలో అందుబాటులో ఉన్న సాంకేతిక విజ్ఞానం, ఆధునిక పరికరాలను వారికి అందుబాటులో ఉంచుతోంది. షార్ట్‌టెర్మ్ ప్రాజెక్టు కోసం వచ్చే పరిశోధక విద్యార్థులకు వేదికగా మారడంతో ఏటా సుమారు 100 మందికి పైగా బీటెక్, ఎంటెక్ విద్యార్థులు ఇక్కడ తమ లక్ష్యాలను పూర్తి చేసుకుంటున్నారు. ప్రతి శుక్రవారం పాఠశాల, కళాశాల విద్యార్థులను ఆహ్వానించి ఇక్కడి సాంకేతికతపై అవగాహన కల్పిస్తోంది.
అంతరిక్ష శోధన వైపు అడుగులు..
భారత్ తలపెట్టిన వీనస్ స్పేస్ మిషన్‌లో అమర్చే అధునిక పరికరాన్ని దేశీయ పరిజ్ఞానంతోనే ఎన్‌ఏఆర్‌ఎల్ రూపొందిస్తోంది. శుక్ర గ్రహం చుట్టూ ఉన్న వాతావరణ అధ్యయనం చేసేందుకు ఈ పరికరం ఉపయోగపడనుంది. ప్రస్తుత వాతావరణం, భవిష్యత్తులో మార్పులపై నాణ్యమైన పరిశోధన, అధ్యయనాలతో జాతీయ ప్రయోజనాలకు కట్టుబడి సంస్థ పనిచేస్తుంది. - డాక్టర్ అమిత్‌కుమార్ పాత్రా, సంచాలకులు, ఎన్‌ఏఆర్‌ఎల్, గాదంకి
నూతన ఆవిష్కరణలు.. భవిష్యత్ ప్రణాళికలు
ఎన్‌ఏఆర్‌ఎల్ ఆధ్వర్యంలో గాదంకి కేంద్రం చుట్టూ సుమారు 60 కిలోమీటర్ల పరిధిలో వర్షపాతాన్ని కొలిచే ఎక్స్-బ్యాండ్ డ్యూయెల్ పోలరైజేషన్ రాడార్‌ను, అత్యంత కచ్చితత్వంతో కూడిన వాతావరణ సూచన, అధ్యయన(పెటా స్కేల్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్) విధానాన్ని ఇస్రో ఛైర్మన్ శివన్ ఇటీవల పారంభించారు.
● పట్టణీకరణతో అధిక జనసాంద్రత మూలంగా మానవ చర్యలతో వాతావరణంలో మార్పులు, వర్షపాతంలో తేడాలు, చోటుచేసుకుంటున్న విపరిణామాలను అర్థం చేసుకునే లక్ష్యంతో హైదరాబాదు కేంద్రంగా ఆధునిక పరికరాలను వినియోగిస్తూ అధ్యయనం ప్రారంభించింది.
●వాతావరణ కాలుష్యం, క్యుములోనింబస్ మేఘాలు, ఏరోసోల్స్ మధ్య జరిగే పరస్పర చర్యలపై అధ్యయనానికి కోల్‌కతా నగరంలో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేస్తోంది. హిమాలయాల పరిసరాల్లో జరిగే వాతావరణ మార్పుల అధ్యయనంపైనా దృష్టి సారించింది. ఇందులో భాగంగా కశ్మీర్ కేంద్రంగా ఏయిర్ గ్లో ఇమేజర్లను ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి: