ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి అందించాల్సిన బాధ్యత సర్పంచులదే అని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సర్పంచులకు శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా.. గ్రామస్థాయిలో సర్పంచులు నిర్వహించాల్సిన పాలన విధులపై అవగాహన కల్పించారు.
వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. సర్పంచులు.. తమ పంచాయతీ పరిధిలో వారానికి 2 రోజులు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై వివరాలు సేకరించాలని మంత్రి సూచించారు. ప్రజాస్వామ్యంలో సర్పంచ్ పదవి గౌరవ ప్రదమైనదని.. దాన్ని సద్వినియోగించుకుంటే రాజకీయంగా ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. మహిళా సర్పంచులు గ్రామస్థాయిలో జరిగే సమావేశాలకు కచ్చితంగా వెళ్లాలన్నారు.
నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణాలు, త్రాగునీటి సమస్యలు పరిష్కరించామన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ను అందజేస్తామని.. గ్రామంలో సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలించి చెత్త నుంచి ఎరువులు, విద్యుత్త్ తయారు చేసేలా చర్యలు తీసుకొంటామన్నారు. రూ.5 వేల కోట్లతో గాలేరు - నగరి, హంద్రీనీవా సుజల స్రవంతి పథకాలను అనుసంధానం చేసి జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, తంబల్ల పల్లె, పలమనేరు నియోజకవర్గాలకు సాగునీరు, తాగునీరు అందిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: