చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బీర్జెపల్లికి చెందిన మణి, అరుణ దంపతుల కుమారుడు తొమ్మిదేళ్ల హర్షవర్ధన్.. అరుదైన రక్త సంబంధిత వ్యాధితో ఐదేళ్లుగా పోరాడాడు. ఐదేళ్ల క్రితం స్కూల్లో జరిగిన ప్రమాదంతో.. హర్షవర్ధన్‌లోని రక్త సంబంధిత వ్యాధి వెలుగుచూసింది. శరీరంలోని వేర్వేరు భాగాల నుంచి రక్తం ధారలా కారిపోయే ఆ వ్యాధిని నయం చేయించేందుకు హర్షవర్ధన్ తల్లిదండ్రులు చేయని ప్రయత్నాలు లేవు.
ఉన్నదంతా అమ్ముకున్నప్పటికీ..
పేద కుటుంబమైనప్పటికీ ఉన్నదంతా అమ్మేసి, ఆ తర్వాత అప్పులు చేసి మరీ వైద్యం చేయించినా.. హర్షవర్ధన్ కోలుకోలేదు. కుమారుడిపై తండ్రి ఆశలు వదిలేసుకున్నా.. తల్లి అరుణ మాత్రం ఎడతెగని పోరాటం చేసింది. బిడ్డను బతికించుకునే ఎందుకు ఉన్న అన్నిరకాల ప్రయత్నాలూ చేసింది. ఎక్కడ చూపించినా వైద్యులు తమ వల్ల కాదని చెప్పేయడంతో.. బిడ్డ బాధ చూడలేకపోయింది.
సర్కారే దయ ఉంచాలని..
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే ఆదుకోవాలని.. లేదా కారుణ్య మరణానికి అనుమతించాలని పుంగనూరు కోర్టును కోరేందుకు.. రెండు రోజులుగా ప్రయత్నం చేస్తోంది. కోర్టుకు సెలవు కావడంతో, ఏం చేయాలో తెలియక.. బరువెక్కిన హృదయంతో తిరుగు ప్రయాణమవుతున్న ఆ తల్లిని.. కాసేపటికే విధి వెక్కిరించింది. ఇంటికి వెళుతున్న సమయంలో హర్షవర్ధన్ ప్రాణాలు కోల్పోయాడు.
జీవిత భాగస్వామి లేకున్నా..
భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయినా.. ఇన్నేళ్లపాటు ప్రాణాలతో పోరాడిన పేగు బంధాన్ని రక్షించుకునేందుకు శ్రమించిన ఆ తల్లి.. కుమారుడు విగతజీవిగా మారాడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది. హర్షవర్ధన్ చనిపోవడానికి ముందు.. తన కొడుకుని కాపాడమంటూ ఆ తల్లి చేసిన వేడుకోలు అందరి హృదయాలను బరువెక్కిస్తోంది.
విధిలేని దుస్థితిలో..
బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ తల్లి పడిన కష్టం.. విధిలేని దుస్థితిలో కారుణ్య మరణం కోసం ప్రయత్నించడం.. అదే సమయంలో ఆ పసివాడు మృతి చెందడం.. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బీర్జెపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తల్లని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు.
ఇవీ చూడండి : Anandaiah: ఔషధ తయారీని త్వరలోనే ప్రారంభిస్తాం: ఆనందయ్య