స్థానిక ఎన్నికల నిర్వహణను వెంటనే రద్దు చేసి కేంద్రం ఆధ్వర్యంలో.. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నామినేషన్ల ప్రక్రియలో గాయపడిన భాజపా కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో అప్రజాస్వామిక పద్ధతిలో స్థానిక ఎన్నికల నామినేషన్లు జరిగాయన్నారు. మంత్రులు, శాసనసభ్యులు ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు, అధికార యంత్రాంగం, వైకాపా నేతలు ఏకమై ఎన్నికలను ఏకగ్రీవంగా చేసుకున్నారని విమర్శించారు. సీఎం జగన్ వ్యాఖ్యలు ఎస్ఈసీని బెదిరిస్తున్నట్లు ఉన్నాయన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల నుంచి కోట్లు వసూలు చేసుకుని ఏకగ్రీవంగా పదవుల కట్టబెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో భాజపా కార్యకర్తలకు ప్రాణహాని ఉందన్నారు. ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఇదీ చదవండి : ఎస్ఈసీని తెదేపా ప్రభావితం చేసింది: కాకాని గోవర్థన్