ఈ నెల 25 ఉదయం 9 గంటల నుంచి శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా టీకా రెండు డోసులు వేసుకొన్న ధ్రువీకరణ పత్రం లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ (compulsory corona vaccination certificate for tirumala darshan) తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు.
సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన తర్వాత, సెప్టెంబరు 26 నుంచి తిరుపతి లో శ్రీనివాసం వసతి గృహంలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపి వేస్తామని అన్నారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు.. దర్శన సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని తితిదే ఛైర్మన్ తెలిపారు. కొవిడ్ నియంత్రణ కోసం తితిదే తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్న తితిదే