ప్రంపచ ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు క్రిస్‌హెమ్స్‌వర్త్ మొదలు.. దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ వంటి ప్రముఖుల వరకు వారు నటించే చిత్రాల్లో ధరించే దుస్తులు చిత్తూరు జిల్లా శ్రీసిటీలో తయారవుతున్నాయి. సత్యవేడు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటైన ప్రత్యేక ఆర్థిక మండలిలో ఎమ్‌ఎస్‌ఆర్ గార్మెంట్స్ పేరుతో ఉత్పత్తి అవుతున్న సూట్లు, జాకెట్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. బ్రిటన్‌లోని షావెల్‌రో ప్రాంతం అత్యంత ఖరీదైన సూట్లు, జాకెట్ల విక్రయ కేంద్రాలకు నిలయం.
సూట్లు, జాకెట్లు, కోట్లు వంటి ఖరీదైన దుస్తులకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాడ్ ఆండ్ ద డాండ్ కంపెనీ షావెల్‌రో తో పాటు బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాల్లో తమకున్న దుకాణాల్లో విక్రయించే దుస్తులు శ్రీసిటీలో ఉత్పత్తి అవుతున్నాయి. శ్రీసిటీలో గ్రామీణ ప్రాంత మహిళల నైపుణ్యంతో రూపుదిద్దుకొంటున్న దుస్తులు ప్రపంచ దేశాల్లో వివిధ పేర్లతో విక్రయమవడంతో పాటు హాలీవుడ్ హీరోల మనసు చూరగొంటున్నాయి.
హాలీవుడ్ హీరోలు మెచ్చే స్థాయిలో శ్రీసిటీలో తయారవుతున్న దుస్తులకు అవసరమైన ముడిసరకును ఎమ్.ఎస్.ఆర్ గార్మెంట్ సంస్థ విదేశాల నుంచి దిగుమంతి చేసుకొంటోంది. సూట్, జాకెట్లకు వినియోగించే క్లాత్ మొదలు దారం, గుండీలు, జిప్ ఇలా ప్రతి వస్తువును విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు.
ఇటలీతో పాటు యూరప్‌లోని స్పెయిన్, ప్రాన్స్, నార్వే, స్వీడన్ వంటి దేశాల నుంచి అత్యంత నాణ్యత ఖరీదైన జీనియా బెర్బరీ, హెచ్.ఎఎఫ్.డబ్ల్యూ, లోరోపియానో వంటి బట్టను దిగుమతి చేసుకొంటున్నారు. విదేశాల నుంచి వచ్చే అత్యంత నాణ్యత కలిగిన ముడి సరకులతో శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లోని మహిళతో సూట్లు, జాకెట్లు, కోట్లు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
ఎమ్‌ఎస్‌ఆర్ గార్మెంట్స్ శ్రీసిటీలో పది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పరిశ్రమ ద్వారా ఉత్పత్తయ్యే దస్తులను స్వీడన్, అమెరికా, యూకే, న్యూయార్క్ వంటి దేశాల్లో వివిధ బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్నారు. బ్రిటన్‌లో కాడ్ అండ్ ద డ్యాండ్ పేరుతో విక్రయిస్తుండగా అమెరికాలో టెన్ ఎకర్స్ పేరుతో మార్కెట్ చేస్తున్నారు. హాలీవుడ్ నటులు క్రిస్‌హెమ్స్, విల్‌స్మిత్, జోస్‌బ్రాలిన్, టామీలీ, కెల్సెగ్రామర్, నోయల్ గలాగర్, క్రిస్‌రాక్, టాబీ జోన్స్ తో పాటు గాయకుడు ఎల్టన్‌జాన్, టెన్నిస్ ఆటగాళ్లు ఆండ్రీఅగస్సీ, విజయ్ అమృతరాజ్, జకోవిచ్ వంటి వారు శ్రీసిటీలో తయారవుతున్న సూట్లు, జాకెట్లు, కోట్లు ధరిస్తున్నారు.
విదేశాల నుంచి ముడిసరకును దిగుమతి చేసుకొని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఉత్పత్తులను ఎగుమతి చేయగల రీతిలో అత్యంత నైపుణ్యం, వృత్తి పట్ల నిబద్ధత కలిగిన మానవవనరులు శ్రీసిటీ ప్రాంతంలో లభ్యమవుతున్నాయన్న అభిప్రాయం ఎమ్.ఎస్.ఆర్ గార్మెంట్స్ యాజమాన్యం వ్యక్తం చేస్తోంది. ప్రపంచ దేశాల్లో ఉన్న ట్రెండ్‌కు తగిన రీతిలో సూట్లు తయారు చేయడానికి ఆయా దేశాల నిపుణులతో శిక్షణా తరగతులను యాజమాన్యం ఏర్పాటు చేస్తోంది. విదేశాల నుంచి ముడి సరకుతో పాటు డిజైన్లను రూపొందించడానికి అవసరమైన గర్బర్ అనే సాఫ్ట్‌వేర్ దిగుమతి చేసుకొని వాటికి అనుగుణంగా దుస్తులు తయారు చేస్తున్నారు.
ఎమ్.ఎస్.ఆర్ గార్మెంట్స్‌లో తయారవుతున్న దస్తులు విదేశాలకు ఎగుమతి అవుతుండగా భారతదేశంలో విక్రయించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పురుషులకు అవసరమైన జాకెట్లు మాత్రమే ఉత్పత్తి అవుతుండగా మహిళకు అవసరమైన దుస్తులను రూపొందించే దిశగా చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: