లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేలా తిరుపతి ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని లీలా మహల్ సర్కిల్ వద్ద కరోనా రూపాన్ని రహదారిపై చిత్రించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిర్దేశిత సమయం దాటిన తర్వాత అనవసరంగా రోడ్ల పైకి వచ్చే వారి పై కేసులు నమోదు చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో కేవలం అత్యవసర సేవలు మినహా మిగిలిన వారికి అనుమతి లేదని... ఆంక్షలను అతిక్రమించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరోనా వేషధారణతో చైతన్యం
రాను రాను విజృంభిస్తున్న కరోనాపై చిత్తూరు జిల్లా భాకరాపేట పోలీసులు స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లాక్ డౌన్ ఉన్నప్పటికీ ప్రజలు రోడ్లపైకి రావడంతో.. కరోనా వేషధారణతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. కరోనాకు మందు లేదని.... నివారణ ఒక్కటే మార్గమని.... అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లాక్ డౌన్‌ను తప్పక పాటించాలని పోలీసులు కోరారు. అనవసరంగా రోడ్ల పై వచ్చిన వారి పై జరిమానా విధిస్తున్నారు.
కరోనా బొమ్మ గీసి అవగాహన
ఇంట్లోనే ఉంటూ కరోనా వైరస్‌ను నివారించాల్సిన బాధ్యత మనందరి పై ఉందని కడప చిత్రకారుల సంఘం అధ్యక్షులు షరీఫ్ అన్నారు. కడప ఏడు రోడ్ల కూడలి వద్ద జిల్లా చిత్రకారుల సంఘం ఆధ్వర్యంలో కరోనా వైరస్ బొమ్మ వేసి... అవగాహన కల్పిస్తున్నారు. దాదాపు 7 గంటల పాటు 25 మంది చిత్రకారులు శ్రమించి ఈ బొమ్మ గీశారు. వైరస్ కట్టడి చేయాలంటే మనమందరం నివాసాల్లోనే ఉండాలని తెలిపారు.
ఇవీ చదవండి:
పెళ్లిళ్ల సీజన్ పై కరోనా తీవ్ర ప్రభావం... మిగిలింది భారీ నష్టం