స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయం ఇప్పుడిప్పుడే సాధారణ స్ధితికి చేరుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి నిత్యం వేల మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తున్నారు. ఫలితంగా ఆలయం భక్తులతో కళకళలాడుతోంది. ఇదే తరహాలో స్వామివారి హుండీలు నిండిపోతున్నాయి.
కరోనా నేపథ్యంలో స్వామివారి ఆలయానికి గతేడాది మార్చి 23నుంచి భక్తులకు అనుమతి లేకుండా చర్యలు తీసుకున్నారు. కొవిడ్ నిబంధనలు అనుసరించి అనంతరం దేవాదాయశాఖ ఆదేశాల మేరకు జూన్ ఎనిమిదో తేదీ నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. జులై, ఆగస్టులో కొంతమేర భక్తుల రద్దీ తగ్గింది. సెప్టెంబరు నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఫలితంగా వరసిద్ధుని హుండీ ఆదాయం పెరిగింది. రూ.వేలల్లో ఉన్న హుండీ ఆదాయం ప్రస్తుతం రూ.లక్షల్లోకి చేరుకుంది. స్వామివారి ఆర్జిత సేవలను పునరుద్ధరించడంతో ఇటు టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం బాగా పెరిగింది. నూతన సంవత్సరాది సందర్భంగా కేవలం దర్శన టికెట్ల విక్రయం ద్వారా సుమారు రూ.8 లక్షల ఆదాయం వచ్చింది. దీంతోపాటు ఇప్పటి వరకు భక్తుల విరాళాల ద్వారా అన్నదానం, గోసంరక్షణ ఇతర పథకాలకు సుమారు రూ.కోటి మేర విరాళాలు వచ్చినట్లు అధికారుల అంచనా.