కుప్పం మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలుగుదేశం నేతలు 19 మందిపై నమోదుచేసిన కేసులో అరెస్ట్ సహా తొందరపాటుచర్యలొద్దని కుప్పం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కుప్పం మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు, కుప్పం ఎస్హెచ్వో కు నోటీసులు జారీచేసింది. తనపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించారని చాంబర్లోకి చొచ్చుకొచ్చి లాక్కెళ్లి నిర్బంధించారని కుప్పం మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు తెలుగుదేశం నేతలు అమర్‌నాథ్ రెడ్డి, పులవర్తి నాని, జి. శ్రీనివాసులు తదితరులపై కేసు నమోదు చేశారు. ఆ కేసు కొట్టేయాలని.. తెలుగుదేశం నేతలు హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశారు.
విధులను ఎవరు అడ్డుకున్నారో ఫిర్యాదిదారు స్పష్టంగా పేర్కొనలేదని పిటీషనర్ల న్యాయవాది వాదించారు. పిటిషనర్లపై ఎలాంటి నిర్దిష్ట ఆరోపణలు లేవన్నారు. దాడికి పాల్పడలేదన్నారు. తెలుగుదేశం తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు, వేధించేందుకు తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. అమర్నాథ్ రెడ్డి, పులవర్తి నాని, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని అర్ధరాత్రి పోలీసులు తీసుకెళ్లారన్నారు. వారి విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలని కోరారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... అరెస్ట్ సహా తొందరపాటు చర్యలొద్దని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ఇదీ చదవండి: కుప్పంలో తెదేపా నేతలపై కేసులు నమోదు..