- చిత్తూరు జిల్లా..
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును .. అభిమానులు వేడుకలా చేసుకున్నారు. చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద తెలుగు యువత నాయకులు కొబ్బరి కాయలు కొట్టారు. తెలుగు యువత అధ్యక్షుడు శ్రీధర్ వర్మ.. అభిమానులు కలసి 660 కొబ్బరి కాయలను కొట్టారు. రెండు కేజీల కర్పూరం వెలిగించి బాలకృష్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామి వారిని ప్రార్థించారు.
- అనంతపురం జిల్లా ..
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిందూపురం పట్టణంలోని బాలకృష్ణ ఇంటి వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు అభిమానులు 60 కేజీల కేక్ కట్ చేశారు.
హిందూపురం గ్రామీణ మండలం కిరికెర గ్రామంలో బాలయ్య పుట్టినరోజు వేడుకలను జరిపారు. అభిమానులు.. చిన్నారులతో కేక్ కట్ చేయించారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, జామెంట్రీ బాక్స్‌లు, మాస్కులను పంపిణీ చేశారు. పలుచోట్ల మిఠాయిలు పంపిణీ చేశారు.
జిల్లాలోని కళ్యాణదుర్గం తెదేపా కార్యాలయంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి.. కేక్ కట్ చేశారు. తమ అభిమాన హీరో సుఖసంతోషాలతో ఉండాలని ..వారు కోరుకున్నారు.
ఎన్బీకె హెల్పింగ్ హాండ్స్, బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో హీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను అనంతపురంలో ఘనంగా నిర్వహించారు. 60వ పుట్టినరోజు సందర్భంగా జిల్లాలో పది చోట్ల... ఒక్కోచోట 60 కేజీల కేకులు కట్ చేశారు. ప్రపంచస్థాయి గుర్తింపులో వేడుకలను చేస్తున్నామని ఎన్బీకె హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షుడు జగన్ తెలిపారు. బాలయ్య బాబు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని... నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
- విశాఖ జిల్లా ..
విశాఖ జిల్లా పాయకరావుపేటలో సినీ నటుడు, హిందుపురం తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి. నందమూరి కల్చరల్ యూత్ అధ్యక్షులు చింతకాయల రాంబాబు ,తెదేపా నాయకులు చిట్టి బాబు, వెంకటేష్ ఆధ్వర్యంలో అభిమానులు, తెదేపా కార్యకర్తలు కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచారు. పేదలకు భోజనాలు పెట్టారు. పార్టీకి సేవలు అందించిన కార్యకర్తలకు అభిమానులను ఈ సందర్భంగా సత్కరించారు.
- శ్రీకాకుళం జిల్లా ..
హీరో నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఘనంగా జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి...అభిమానులకు తినిపించారు. బాలకృష్ణ గొప్ప హీరోగా ... ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని ఆయన. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం