జలయజ్ఞం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 54 ప్రాజెక్టులు చేపట్టినట్టు సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వం పేర్కొంది. పునర్విభజన తర్వాత రాష్ట్రంలో 40 ప్రాజెక్టులున్నాయి. ఇందులో పోలవరం ప్రాజెక్టుతోపాటు ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల రైతులు, ప్రజలకు ఉపయోగపడే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన నిర్మిస్తున్నామని అందులో వెల్లడించారు. 40 ప్రాజెక్టులనుగాను ఇప్పటికే 14 పూర్తి కాగా.. రెండింటిలో మొదటి దశ పనులు పూర్తయ్యాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంత రైతులకు ఉపయోగపడే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పనులు 89.90 శాతం మేర అయ్యాయని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న కాలంలో అధిక కేటాయింపులు చేశారు.
మిగిలిన 700 ఎకరాలు సేకరిస్తే..
మరోవైపు మదనపల్లె హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ పరిధిలో 7,063.61 ఎకరాలు సేకరించాలని లక్ష్యం పెట్టుకోగా.. సుమారు 6,600 ఎకరాల వరకు భూసేకరణ చేశారు. పీలేరు పరిధిలో 7,323.17 ఎకరాలకుగాను దాదాపు 6,900 సేకరించారు. మొత్తంగా రెండు యూనిట్ల పరిధిలో కలిపి సుమారు 700 ఎకరాలకుపైగానే భూసేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. వీటిని కూడా సేకరిస్తే పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. గతేడాది బడ్జెట్‌లో రూ.565.12 కోట్లు కేటాయించగా.. విడుదలైంది రూ.298.49 కోట్లు మాత్రమే. ఇందులో కూడా ఎక్కువగా అనంతపురం జిల్లా పరిధిలోనే ఖర్చు చేశారు. ఈ ఏడాది హెచ్‌ఎన్‌ఎస్‌కు రూ.1,042.06 కోట్లు కేటాయించారు. ఈ నిధులను ఖర్చు చేస్తే కొన్ని ప్రాంతాలకైనా వచ్చే ఏడాది నీరు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా పడమటి మండలాల ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్ఛి. పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయిస్తే రైతులకు అండగా నిలిచిన వారవుతారు.
ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు
2014లో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక.. ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడంతోపాటు వాటిని ఖర్చు చేసేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా తొలిసారి జిల్లాలోకి కృష్ణా జలాలు ప్రవేశించాయి. తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలకు సాగు, తాగునీటి కష్టాలు కొంతమేర తీరాయి. రూ.430 కోట్లతో చివరి ప్రాంతంగా ఉన్న పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 6,300 ఎకరాలకు నీరు అందేలా ప్రణాళికలు రూపొందించారు. 2019 మార్చి నాటికి జిల్లావ్యాప్తంగా సుమారు 88 శాతం పనులు పూర్తయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో పెద్దగా పనులే చేయలేదు. పెండింగ్ పనులు పీలేరు, చంద్రగిరి, పూతలపట్టు నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. మిగతా 12 శాతం పనుల పూర్తికి ఏకంగా రెండేళ్ల సమయం తీసుకోవడంపై అన్నదాతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇవి పూర్తయితే సుమారు 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి..