ప్రశ్న: పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు... కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
ధర్మారెడ్డి: రోజుకు 35 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశాం. ఈ దర్శనాలను 2 రకాలుగా విభజించాం. 300 రూపాయల టికెట్ల దర్శనానికి రోజుకు 20 వేల మందికి కల్పించేలా టికెట్లు మంజూరు చేశాం. పది రోజుల్లో 2లక్షల మందికి దర్శనం కల్పించేలా ఆన్లైన్లో టికెట్లు విడుదల చేశాం. సర్వదర్శనం టికెట్లు ఆఫ్ లైన్లో ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. కంప్యూటర్ వ్యవస్థ అందుబాటులో లేనివారికి శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో.. ముందు జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని.. స్థానికులకు టికెట్లు ఇచ్చే బాధ్యతను అప్పగించాము.
ప్రశ్న: ప్రముఖులను అత్యంత ప్రముఖులను వైకుంఠ ఏకాదశి రోజు నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు?
జవాబు: ఈ నెల 25న వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులు కూడా రాజ్యంగ పదవుల్లో ఉన్నటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే దర్శనానికి వీఐపీ దర్శనాలకు అనుమతిస్తాం. వీఐపీ టికెట్లను నియంత్రించే క్రమంలో రిఫరల్స్‌కు అనుమతి ఇవ్వడం లేదు.
ప్రశ్న: లడ్డూల పంపిణీ వద్ద, భక్తుల రద్దీ నేపథ్యంలో శానిటైజేషన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
జవాబు: వైద్య, ఆరోగ్య అధికారులు చాలా విస్తృతంగా శానిటైజేషన్ ఏర్పాట్లు చేస్తున్నారు. అలిపిరి నుంచే శానిటైజేషన్ మొదలవుతుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటుగా వారి వాహనాలను శానిటైజ్ చేస్తారు. కౌంటర్ల దగ్గర దూరం పాటించేలా చర్యలు చేపట్టాం. ప్రతి రెండు గంటలకు ఒకసారి శుద్ధి చేసేలా చర్యలు తీసుకున్నాం.
ప్రశ్న: పది రోజుల్లో కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకొనే భక్తుల కోసం దర్శన సమయం మార్చే అవకాశం ఉందా?
జవాబు: ఇప్పటికైతే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కాలినడక మార్గం 24 గంటలు తెరిచి ఉంచాలా.. లేకుంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి.. అనే అంశంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.
ప్రశ్న: వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరింత మంది భక్తులు తిరుమల వచ్చే అవకాశం ఉంది. దర్శన టికెట్ల సంఖ్యను ఏమైనా పెంచే అవకాశం ఉందా?
జవాబు: ప్రస్తుతానికి అయితే అలాంటి ఆలోచనేదీ లేదు. కరోనా నిబంధనలు పాటించి దర్శనాలకు ఏర్పాట్లు చేయాల్సి ఉన్న కారణంగా.. ఇప్పటివరకు ఎంత మందికి దర్శనం కల్పిస్తున్నామో.. అప్పుడు కూడా అలాగే జరిపిస్తాము. మరింత ఎక్కువ మందికి కొవిడ్ నిబంధన ప్రకారం దర్శనం కల్పించగలమన్న నమ్మకం వస్తే నిర్ణయం మార్చడానికి ప్రయత్నిస్తాం.
ఇవీ చూడండి: