Express Way: దక్షిణ భారతదేశంలో తొలి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ప్రతిపాదిత ఎక్స్‌ప్రెస్ వే ద్వారా కర్ణాటకలోని కోలార్, తమిళనాడులోని వేలూరు, రాణిపేట, తిరువళ్లూర్, ఏపీలోని చిత్తూరు జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 26న బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ రహదారి (ఎన్‌ఈ-7) నిర్మాణానికి ప్రధాని మోదీ చెన్నైలో శంకుస్థాపన చేయనున్నారు.
కర్ణాటకలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లాలో జూన్‌లో మొదలు కానున్నాయి. ఈ రహదారి పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) లక్ష్యంగా పెట్టుకుంది.
4-6 మీటర్ల ఎత్తులో ప్రయాణం.. 4 వరుసల్లో ఉండే ఈ రోడ్డు కర్ణాటకలోని హొస్‌కోటలో ప్రారంభమై.. రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వి.కోట మండలం నెర్నిపల్లి మీదుగా వస్తుంది. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ వద్ద రహదారి ముగుస్తుంది. భవిష్యత్తులో రహదారిని 8 వరుసలకు విస్తరించేలా నిర్మిస్తున్నారు. గంటకు 120 కి.మీ.మేర వాహనాలు ప్రయాణించేలా రూపొందించారు.
భూఉపరితలం నుంచి 4-6 మీటర్ల ఎత్తులో ప్రయాణం సాగనుంది. తద్వారా వాహనాల రాకపోకలకు అంతరాయం ఉండదు. చిత్తూరు జిల్లాలో 1,594.72 ఎకరాల ప్రైవేటు భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటికే 80 శాతం సేకరించారు.
రహదారి వెంట గిడ్డంగులు, వాహనాల పరిశ్రమలు.. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవా (సీబీఐసీ) సమీపం నుంచే ఎక్స్‌ప్రెస్ వే వెళుతుంది. ఈ రహదారి వెంట గిడ్డంగులు, వాహన పరిశ్రమలు విరివిగా ఏర్పడి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఎన్‌హెచ్‌ఏఐ చిత్తూరు ప్రాజెక్టు డైరెక్టర్ ప్రశాంత్ తెలిపారు. బెంగళూరు నుంచి వచ్చే సరకు రవాణా వాహనాలు త్వరగా చెన్నై నౌకాశ్రయానికి చేరతాయి.
ఇదీ చదవండి: