చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ములకలచెరువు సమీపంలో చెన్నై -హైదరాబాద్ జాతీయ రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న యేసువారిపల్లి వద్ద గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొడాలి భాస్కర రావు, ఆయన కుమారుడు ప్రదీప్ 20 ఎకరాల భూమి కొనుగోలు చేసి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశారు. ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, నీటివసతి, ఇతర అనుకూల పరిస్థితుల కారణంగా డ్రాగన్ ఫ్రూట్ వేయడానికి అనుకూలంగా ఉండడంతో భూమి కొని పంట వేశామని చెబుతున్నారు.
3 సంవత్సరాల క్రితం ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ సాగు ప్రారంభించారు. ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో పంట దిగుబడి తీశారు. మొదటిసారి ఎకరాకు ఒక టన్ను దిగుబడి వచ్చింది. రెండో సంవత్సరం 2, 3 టన్నులు మూడో ఏడాది 4, 5 టన్నులు.. ఇలా ప్రతి ఏటా.. దిగుబడి పెరుగుతుందని డ్రాగన్ ఫ్రూట్ సాగు రైతు ప్రదీప్ చెబుతున్నారు. మొదటిసారి ఎకరాకు 6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మొదటి పంట దిగుబడి మూడు సంవత్సరాలకు వస్తుంది. నాలుగో సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు ఎకరాకు పెట్టుబడి 50 వేలు మాత్రమే అవుతుంది. దిగుబడి ఏడాదికేడాది పెరుగుతూ వస్తుంది. మొదటిసారి పెట్టుబడికి ప్రభుత్వ ఉద్యానవన శాఖ రాయితీ కూడా కల్పిస్తుంది.
అధిక వర్షాలకు, వర్షాభావానికి ఈ పంట తట్టుకుంటుంది. అధిక వర్షాలు సంభవించినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మొదట్లో నీరు నిల్వ ఉండకుండా చేస్తే చాలు. తక్కువ నీటితో ఈ పంట పండుతుంది. ఈ పంట వేసుకోవడానికి అధికారులు సైతం సహకరిస్తారు. మెుదటిసారి తంబళ్లపల్లెలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసిన భాస్కర్ రావు కూడా మొక్కలను అందజేయడానికి ముందుకు వస్తున్నారు. ఈయన వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్ ఫ్రూట్ మొక్కల నర్సరీని కూడా నిర్వహిస్తున్నారు. కావలసిన రైతులు ములకలచెరువు సమీపంలోని యేసువారిపల్లి వద్దకు వెళితే మొక్కలతోపాటు సూచనలు, సలహాలు, అనుభవాలను అందిస్తారు. 9440438398, 7013274040 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల, రసం తయారు చేసుకుని సేవించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగుతాయి. రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ఎసిడిటీ సమస్యలు పోతాయని వైద్యులు చెబుతున్నారు. రాయలసీమ రైతులకు డ్రాగన్ ఫ్రూట్ సాగు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు.
ఇదీ చదవండి: దేశంలో కొత్తగా 45,149 కేసులు.. 480 మరణాలు