‘పేదలందరికీ ఇళ్లు’.. ఇది ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. జులై 8న పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేనిచోట ప్రైవేటు భూములను కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఇందులో డబ్బులు సంపాదించే మార్గాలను అన్వేషించారు పలమనేరులో కొందరు దళారులు, అధికారులు. 30 రోజుల్లో లక్షాధికారులు కావాలని లక్ష్యంగా పెట్టుకొని, రెండే స్వీయ షరతులు విధించుకున్నారు. అవి పైసా కూడా పెట్టుబడి పెట్టకూడదు, ప్రభుత్వ ఖజానాను మాత్రమే కొల్లగొట్టాలి. ఈ రెండంచెల సూత్రాన్ని ఎలా అమలు చేశారంటే..!
పలమనేరు మున్సిపాలిటీలో 3,263 మంది లబ్ధిదారులకు 65 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించి స్థలాలుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బొమ్మదొడ్డి ప్రాంతంలో 35 ఎకరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం 70 శాతానికిపైగా ఇక్కడ భూసేకరణ పూర్తయింది. ఈ ప్రాంతంలో ఎకరం భూమి రూ.20 లక్షల విలువ చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. యజమానుల నుంచి స్థలం కొనుగోలు చేసేటప్పుడు వారు అసంతృప్తి చెందకుండా.. మార్కెట్ ధర ప్రకారం లేదా కొంత ఎక్కువ రేటు చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. ఈ సమయంలో రాజకీయ పలుకుబడితో దళారులు కొందరు రైతులను ఆశ్రయిస్తున్నారు. అధికారులు మీ భూమికి తక్కువ పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.. మీకు ఎక్కువ పరిహారం వచ్చేలా చేస్తామని మభ్యపెడుతున్నారు. ఈ విషయంలో భూ యజమానులు నోరు మెదపకుండా ఉండేలా అధికారులు, దళారులు జాగ్రత్తలు వహిస్తున్నారు.
ఉదాహరణకు అధికారులు ఇవ్వజూపింది రూ.22 లక్షలు అయితే.. మరో రూ.2లక్షలు- రూ.3 లక్షలు అధికంగా డబ్బులు మంజూరు చేయిస్తామని చెబుతున్నారు. ఎక్కువగా వచ్చిన పరిహారంలో యజమానులకు 20-30 శాతం ఇచ్చి, మిగతా 70- 80 శాతం సర్కారీ సొమ్మును అధికారులు, దళారులు పంచుకుంటున్నారు. మాట వినకుంటే తక్కువ పరిహారం వచ్చేలా చేస్తామని చెబుతుండటంతో రైతులు నోరెత్తలేని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల చెట్లు, ఉద్యాన పంటలు, బోర్లు లేకపోయినా ఉన్నట్లు చూపి.. ఎక్కువ పరిహారం వచ్చేలా దళారులు పావులు కదిపారు. పెంచిన పరిహారం రైతులకు ఇస్తే ఉపయోగం కాని.. సెంటు భూమి కూడా కోల్పోని దళారులకు ఇస్తే ప్రయోజనమేంటని వారు వాపోతున్నారు. మొదటి విడత పరిహారం ఖాతాలో పడగానే.. పెంచిన పరిహారం డబ్బులు ఇవ్వాలని దళారులు డిమాండ్ చేస్తున్నారు.
సూత్రధారి ఒకరే
ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ఈ వ్యవహారంలో తెరపై దళారులు కనిపిస్తుండగా.. తెర వెనుక ఓ అధికారి తంతును నడిపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. గతంలో కూడా ఆ అధికారిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో ఇదే తరహాలో పరిస్థితి ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి.. చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లదు.
పరిశీలించి.. చర్యలు తీసుకుంటాం
భూసేకరణలో అక్రమాలు ఏవైనా జరిగితే.. పరిశీలిస్తాం. నిజాలున్నాయని తేలితే చర్యలు తీసుకుంటాం. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా ధరలు పెంచినట్లు తెలిస్తే విచారణ చేయిస్తాం. - మార్కండేయులు, జేసీ (రెవెన్యూ)
ఇదీ చదవండి: కరోనా వేళ గుదిబండగా మారిన గృహహింస