సరిగ్గా పదిహేను రోజుల క్రితం చిత్తూరు జిల్లా సరిహద్దున ఉన్న చెన్నై కోయంబేడు మార్కెట్ రైతులు, వ్యాపారులతో కళకళలాడింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. ప్రస్తుతం మదనపల్లె టమోటా మార్కెట్ పరిస్థితి కూడా అదేవిధంగా మారింది.
లాక్డౌన్ సమయంలోనూ రైతులు తమ పంటలను మార్కెటింగ్ చేసుకునే విధంగా కేంద్రం సడలింపులు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన మదనపల్లె మార్కెట్‌కు నిత్యం టన్నుల్లో టమోటా వస్తోంది. ఇందులో పొరుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రోజుకు 1300 మెట్రిక్ టన్నుల టమోటా ఇక్కడకు వస్తోంది. అన్లోడింగ్, గ్రేడింగ్ పనులతో మార్కెట్ హడావిడిగా మారింది. భౌతిక దూరం, మాస్కులు వేసుకోవడం, హమాలీల కోసం శానిటైజర్ల నిర్వహణ కచ్చితంగా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
పెద్దసంఖ్యలో వాహనాలను మార్కెట్లో అడ్డదిడ్డంగా నిలిపివేస్తుండటంతో పారిశుద్ధ్య పనులకు ఆటంకం ఏర్పడింది. మార్కెట్లో ఎక్కడ చూసినా కుళ్ళిపోయిన టమాటాలే గుట్టలుగుట్టలుగా దర్శనమిస్తున్నాయి. తాజాగా మార్కెట్‌ను పరిశీలించిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదన్ రెడ్డి సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని హెచ్చరించారు.
ఇప్పటికే మదనపల్లెతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: గురుకుల పాఠశాలలో క్వారంటైన్ వద్దని ఆందోళన